గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్నఉల్లి ధరలు ఏపీలో తగ్గు ముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది, రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అధికారుల దాడులు.. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిపివేయటంతో శనివారం,డిసెంబర్7న కర్నూలు మార్కెట్ లో ఉల్లి క్వింటాలు రూ.8,600 పలికింది. కర్నూలు మార్కెట్ లో డిసెంబర్ 4న ఉల్లి క్వింటాలు రూ.12,510 పలికింది. రాష్ట్రంలో ఉల్లి అవసరాలు తీరకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వచ్చే 2,3 రోజుల్లో బహిరంగ మార్కెట్ లో ఉల్లి ధర తగ్గే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు తెలంగాణ, కర్ణాటకల్లో ఉల్లి ధర కిలో 120 దాటి అమ్ముతున్నారు. ఏషియాలోని అతిపెద్ద రెండో మార్కెట్ గా పేరు పొందిన కర్ణాటకలోని హుబ్బళి మార్కెట్ లో ఈజిప్టు ఉల్లిపాయ శుక్రవారం కిలో రూ.180 కి చేరింది. ఉత్తర కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి పంటలు భారీ స్థాయిలో నాశనం అయ్యాయి. ఉత్తర కర్ణాటకలోని దారవాడ, హావేరి, కోప్పళ తదితర జిల్లాల్లో ఉల్లి పంటలు వేసిన రైతులు భారీగా నష్టపోయారు.
పంటలు నాశనం కావడంతో ఉల్లిపాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అనుకున్న స్థాయిలో ఉల్లిపాయలు అందుబాటులో లేకపోవడం, ఉల్లి పంటలు నాశనం కావడంతో ఉల్లిపాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉల్లి ధరలు చివరికి పార్లమెంట్ ను తాకాయి.