Onion Prices : త్వరలో ఉల్లి ఘాటు తప్పదా..? పెరుగుతున్న ధ‌ర‌లు.. రెండు వారాల్లో 60% పెరిగాయి

ఏ కూర వండాల‌న్న ఉల్లి త‌ప్ప‌నిస‌రి. ప్ర‌తి ఇంటిలోని వంటగ‌దిలో ఉల్లిగ‌డ్డ‌ లేనిదే ఏ వంట‌కం పూర్తి కాదు.

Onion prices increasing

Onion prices increasing : ఏ కూర వండాల‌న్నా ఉల్లి త‌ప్ప‌నిస‌రి. ప్ర‌తి ఇంటిలోని వంటగ‌దిలో ఉల్లిగ‌డ్డ‌ లేనిదే ఏ వంట‌కం పూర్తి కాదు. ఉల్లిగ‌డ్డ‌ వేస్తే అదో రుచీ. ఉల్లిగ‌డ్డ వేయ‌కుండా వంట చేస్తే కొంద‌రికి ముద్ద దిగదు. అంత‌లా వంటింట్లో పెన‌వేసుకుపోయింది. ఇక పానీపూరీ బండి ద‌గ్గ‌రికి వెళ్తే.. దాదాపుగా ప్ర‌తీ ఒక్క‌రు అనే మాట‌.. ‘భయ్యా తోడా ప్యాస్ దాలో’. అంత‌లా మ‌న జీవితంలో ఉల్లిగ‌డ్డ పెన‌వేసుకుపోయింది. ఉల్లిగ‌డ్డ‌ను కోస్తే క‌న్నీళ్లు వ‌స్తాయ‌ని అంటారు గానీ.. ఇప్పుడు పెరుగుతున్న ఉల్లి ధ‌ర‌లు చూస్తున్నా క‌న్నీళ్లు వ‌స్తున్నాయి. ఉల్లిధ‌ర పెరిగితే మ‌న వంటింటి బ‌డ్జెట్ పెర‌గ‌డం ఖాయం. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు ఇదే ఆందోళ‌న క‌లిగిస్తోంది.

పెరుగుతున్న ఉల్లిగడ్డ ధరలు..

ఉల్లి ధరలు మరోసారి పెరుగుతున్నాయి. అక్టోబరు 25 నాటికి ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉల్లిగ‌డ్డ‌ గరిష్ట చిల్లర ధర కిలోకు రూ.70 వ‌ర‌కు ప‌లుకుతోంది. డిసెంబ‌ర్ వ‌ర‌కు ఖ‌రీఫ్ పంట మార్కెట్‌లోకి వ‌చ్చే అవ‌కాశం లేదు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఉల్లిగ‌డ్డ ధ‌ర పెరుగుతూనే ఉంటుంద‌ని అంటున్నారు. హోల్‌సేల్‌లో అక్టోబ‌ర్ 1న క్వింటా ఉల్లికి రూ.2,506 ప‌ల‌క‌గా, అక్టోబ‌ర్ 26 నాటికి 3,112కి చేరింద‌ని వినియోగదారుల వ్యవహారాల శాఖ డేటా వెల్లడించింది.

Also Read : బంగారం ధరల్లో భారీ మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?

మహారాష్ట్రలోని లాసల్‌గావ్ హోల్‌సేల్ APMC వద్ద సగటు హోల్‌సేల్ ధర గత రెండు వారాల్లో దాదాపు 60 శాతం పెరిగిందని ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. హోల్‌సేల్ ధరలు పెరిగితే.. దేశ వ్యాప్తంగా ఉన్న రిటైల్‌ ఉల్లి ధ‌ర‌లు పెరుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో కిలో ఉల్లి ధ‌ర రూ.50 కంటే ఎక్కువ‌గానే ఉంది. ఆన్‌లైన్ కిరాణా దుకాణాలతో సహా వివిధ మార్కెట్‌లలో కిలో ఉల్లి రూ.50-60 మ‌ధ్య విక్ర‌యిస్తున్నారు.

అహ్మద్‌నగర్ జిల్లా ఉల్లి వ్యాపారుల సంఘం చైర్మన్ నందకుమార్ షిర్కే ఈటీతో మాట్లాడుతూ.. అహ్మద్‌నగర్ మార్కెట్‌లో సగటున పది రోజుల క్రితం కిలో ఉల్లి ధర రూ.35 ఉండగా ప్రస్తుతం కిలో రూ.45కి పెరిగిందని చెప్పారు.

ఉల్లి ఎగుమ‌తుల‌పై 40 శాతం సుంకం..

డిమాండ్ పెరగడం, ఉత్పత్తి ఆలస్యం కావడంతో ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆగస్టులోనే 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. డిసెంబ‌ర్ వ‌ర‌కు ఇదే సుంకం ఉంటుంద‌ని తెలిపింది. అయిన‌ప్ప‌టికీ ధ‌రల పెరుగుతుండ‌డం జ‌నాల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. ధ‌ర‌ల‌ను త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) ద్వారా సేకరించిన ఉల్లిపాయలను హోల్‌సేల్ మార్కెట్‌లలో తక్కువ ధరలకు విక్రయించడం కూడా ప్రారంభించింది.

Also Read: ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

అయితే.. పండుగ సీజన్‌లో ఉల్లికి డిమాండ్ పెరగడం, నిల్వలు తగ్గిపోవడంతో ధరలు పెరిగిన‌ట్లు తెలుస్తోంది. మ‌రే రెండు నెల‌ల పాటు ఉల్లి ధ‌ర పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. గత రెండేళ్లుగా రైతులు నష్టపోవడంతో ఉల్లిసాగు సాగును త‌గ్గించార‌ని, ఇదీ కూడా ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు ఓ కార‌ణంగా క‌నిపిస్తోంది. పెరుగుతున్న ధ‌ర‌తో ఉల్లిపాయలను వినియోగించే లక్షలాది కుటుంబాలపై అదనపు భారం ప‌డ‌వ‌చ్చు.