Pensioners
Pensioners Alert : దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి బిగ్ అలర్ట్.. నవంబర్ డెడ్‌లైన్ దగ్గరపడుతోంది. మీరు కూడా పెన్షన్ పొందితే లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే రాబోయే కొద్ది రోజుల్లో మీరు ఈ 3 ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు అలా చేయకపోతే మీ పెన్షన్ శాశ్వతంగా నిలిచిపోతుంది. పన్ను జరిమానా విధించవచ్చు.
మీరు అనేక ముఖ్యమైన ప్రయోజనాలను కూడా కోల్పోవచ్చు. నవంబర్ 30వ తేదీలోపు లైఫ్ సర్టిఫికేట్, యూపీఎస్ ఆప్షన్, అవసరమైన టీడీఎస్ ఫారమ్‌లను సమర్పించడంలో విఫలమైతే పెన్షన్ నిలిచిపోతుంది. పన్ను పెనాల్టీలు విధించవచ్చు. పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రయోజనాలను పొందాలంటే ఈ 3 కీలకమైన పనులను సకాలంలో పూర్తి చేయాలి. అందుకే, నవంబర్ 30 గడువులోగా తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
1. లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ సమర్పించడం :
ప్రతి ఏడాది మాదిరిగానే పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు చివరి తేదీ నవంబర్ 30. ఈ సర్టిఫికేట్ పెన్షనర్లకు అత్యంత ముఖ్యం. సకాలంలో ఈ సర్టిఫికేట్ సమర్పించకపోతే డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే పెన్షన్లను బ్యాంకు నిలిపివేస్తుంది. 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు అక్టోబర్ 1 నుంచి తమ లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్లను సమర్పించవచ్చు. కానీ, ఇప్పుడు గడువు నవంబర్ 30 వరకు మాత్రమే ఉందని గమనించాలి.
ఇండియా పోస్ట్ అందించే అత్యంత సులభమైన సర్వీసు. పోస్ట్‌మ్యాన్ మీ ఇంటికి వచ్చి మీ ఫింగర్ ఫ్రింట్స్, ఫొటోను తీసుకొని డిజిటల్ సర్టిఫికేట్‌ను జనరేట్ చేస్తారు. ఈ ప్రక్రియకు మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నంబర్, PPO నంబర్ అవసరం. మీరు మీ లైఫ్ సర్టిఫికేట్ సకాలంలో సమర్పించకపోతే తదుపరి నెల నుంచి మీ పెన్షన్ నిలిచిపోవచ్చు.
2. UPS (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్) ఎంపిక.. కేంద్ర ఉద్యోగులకు లాస్ట్ ఛాన్స్ :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో ముఖ్యమైన గడువు నవంబర్ 30, 2025.. యూపీఎస్ (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్)లో జాయిన్ అయ్యేందుకు చివరి తేదీ కూడా నవంబర్ 30, 2025. ప్రభుత్వం గతంలో ఈ గడువును సెప్టెంబర్ 30గా నిర్ణయించింది. కానీ, ఉద్యోగుల అభ్యర్థన మేరకు రెండు నెలల పొడిగించింది. మిగిలి ఉన్న సమయం పరిమితంగా ఉంది. మీరు NPS నుంచి UPSకి మారాలనుకుంటే మీరు నవంబర్ 30లోపు మీ ఆప్షన్‌ను రిజిస్టర్ చేసుకోవాలి.
3. పన్ను ఫారమ్‌లు, TDS స్టేట్‌మెంట్‌లకు నవంబర్ 30 డెడ్‌లైన్ :
పెన్షనర్లతో పాటు, నవంబర్ 30 అనేది పన్ను చెల్లింపుదారులు, కంపెనీలకు ముఖ్యమైన గడువు. అక్టోబర్ 2025కి సంబంధించిన అనేక TDS ఫారమ్‌లు, చలాన్-కమ్-స్టేట్‌మెంట్‌లను సమర్పించేందుకు ఇది చివరి తేదీనని గమనించాలి. ఈ ఫారమ్‌లను నవంబర్ 30 లోపు సమర్పించాలి
ఈ ఫారమ్‌లను సకాలంలో సమర్పించకపోతే.. పన్ను శాఖ జరిమానాలు విధించవచ్చు. అదనంగా, అంతర్జాతీయ లావాదేవీలు లేదా విదేశీ అనుబంధ సంస్థలు కలిగిన కంపెనీలు నవంబర్ 30వ తేదీకి ముందు ట్రాన్స్ ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్ (ఫారమ్ 3CEAA)ను దాఖలు చేయాలి.
పెన్షనర్లు సకాలంలో సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి.. ఎందుకంటే? :
పెన్షనర్లకు అతిపెద్ద ఆదాయ వనరు నెలవారీ పెన్షన్. అందుకే వారి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే బ్యాంకు వెంటనే వారి పెన్షన్‌ను నిలిపివేస్తుంది. ఇంకా, సీనియర్ సిటిజన్లు టాక్స్ ఫారమ్‌లను సమర్పించకపోతే నోటీసులు అందుకోవచ్చు. అలాగే, UPSకు మారని ఉద్యోగులకు ఇకపై ఈ ఆప్షన్ ఉండదు. నవంబర్ 30 నాటికి ఈ 3 పనులను పూర్తి చేయడం అత్యంత ముఖ్యం.