వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

  • Publish Date - September 18, 2019 / 03:59 AM IST

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా ? చమురు దిగుమతులు తగ్గుతుండడంతో భారత్‌లో ధరలు పెరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. జులై నుంచి చూస్తే..పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. సౌదీ ఆరామ్ డ్రోన్ దాడి ఇందుకు కారణం. తూర్పు సౌదీ అరేబియాలోని అబ్‌కైక్‌, ఖురైస్‌లో ఉన్న ఆరాంకో ప్లాంట్లపై గత శనివారం యెమనీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. లీటర్‌కు రూ 5 నుంచి 6 పెరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ఆయిల్ రిఫైనరీ పై దాడుల కారణంగా చమురు శుద్ధి ప్రక్రియకి భారీ ఆంటంకం ఏర్పడింది. రోజుకు 57 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయింది. పర్యవసానంగా అంతర్జాతీయ మార్కెట్‌కు రోజుకు ఐదు శాతం చొప్పున చమురు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని చమురు మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. సౌదీ ప్రభుత్వ చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్‌ దాడులతో ఆ దేశం చమురు ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది. యుద్ధం మొదలైతే అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్న అనుమానాలు ఏర్పడటంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 20 శాతం వరకు పెరిగిపోయాయి. 

మరోవైపు భారత్‌కు రెండో అతి పెద్ద చమురు సరఫరాదారు సౌదీ అరేబియానే. భారత్‌ చమురు అవసరాల్లో 83 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌లో చమురు ధరలు భారీగా పెరనున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. భారత్‌కు 65 రోజులకు సరిపడా ఆయిల్‌ రిజర్వులున్నాయు. అవి పూర్తయ్యేలోగా సంక్షోభం సమసిపోతే చమురు ధరలు దిగివస్తాయి.

ప్రస్తుతం భారత్‌ రోజుకు 45 లక్షల బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాదితో పోలిస్తే ముడి చమురు దిగుమతులు స్వల్పంగా తగ్గాయి. ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఆరు శాతం ఆరాంకో నుంచే జరుగుతోంది. నష్టపోయిన ఉత్పత్తిలో 40 శాతాన్ని వెంటనే పునరుద్ధరిస్తామని.. మొత్తం పునరుద్ధరించడానికి మరో వారం రోజులు పడుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది.