Post office scheme
Post Office Schemes : పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఎందులో పెట్టుబడితే అధిక లాభాలు ఉంటాయి.. ఎలాంటి రిస్క్ ఉండదో తెలుసా? అన్నింటికన్నా (Post Office Schemes) ప్రభుత్వం అందించే పోస్టాఫీసు పథకాలు చాలా బెస్ట్. మంచి రాబడితో పాటు రిస్క్ కూడా ఉండదు. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని సంపాదించుకోవచ్చు.
ఈ పథకాలలో కొన్నింటిలో మోదీ ప్రభుత్వం 8.2శాతం హామీతో కూడిన రాబడిని అందిస్తోంది. అంతేకాదు.. పన్ను ఆదా ప్రయోజనం కూడా పొందవచ్చు. ఈ పోస్టాఫీస్ పథకాలు ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించింది. ఏయే పథకాలు అందుబాటులో ఉన్నాయి? ఎంత వడ్డీ పొందవచ్చు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సుకన్య సమృద్ధి యోజన :
కూతుళ్ల కోసం డబ్బు పొదుపు చేసే పథకం.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో 8.2శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. అన్ని పోస్టాఫీసు పథకాలలో అత్యధికం. తల్లిదండ్రులు లేదా గార్డియన్లు ఒక అమ్మాయికి 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
మీరు ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ డబ్బు పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. ఈ పథకం 21 ఏళ్లు తర్వాత లేదా 18 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత అమ్మాయి వివాహం కోసం డబ్బులు తీసుకోవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) :
పీపీఎఫ్ (PPF) అనేది ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకునే మహిళలకు బెస్ట్. ఈ ప్లాన్ కాల వ్యవధి 15 ఏళ్లు ఉంటుంది. ఆ తర్వాత మరో 5 ఏళ్లు కావాలంటే పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం, 7.1శాతం వార్షిక వడ్డీని ఇస్తుంది. వడ్డీ ప్రతి ఏడాది పెరుగుతుంది. మీరు పెట్టే డబ్బు, సంపాదించే వడ్డీ మొత్తంపై కూడా ఎలాంటి పన్ను ఉండదు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ (NSC) :
ఒక మహిళ స్థిర రాబడితో 5 ఏళ్లు పెట్టుబడి పెట్టాలనుకుంటే NSC అద్భుతమైన పథకం.. ప్రతి ఏడాదిలో 7.7శాతం వడ్డీని ఇస్తుంది. 5 ఏళ్ల చివరిలో మీకు వడ్డీతో సహా మొత్తం లభిస్తుంది. సెక్షన్ 80C కింద పెట్టుబడి పెట్టిన డబ్బుపై పన్ను ఆదా కూడా అవుతుంది.
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS) :
ఈ పథకం ప్రతి నెలా డబ్బు అవసరమైన మహిళలకు చాలా మంచిది. 7.4శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది. ప్రతి నెలా మీ బ్యాంక్ అకౌంటులో వడ్డీ జమ అవుతుంది. పెట్టుబడి కాల వ్యవధి 5 సంవత్సరాలు. మీరు ఒక అకౌంటులో రూ. 9 లక్షల వరకు, జాయింట్ అకౌంటులో రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. గృహిణులు, వృద్ధ మహిళలకు మంచిది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC) :
మహిళల కోసం ఈ ప్రత్యేక పథకం 2023లో ప్రారంభమైంది. ఎక్కువ మంది మహిళలు ఈ పథకంలో చేరుతున్నారు. కేవలం 2 ఏళ్లు మాత్రమే. ప్రతి ఏడాది 7.5శాతం వడ్డీ వస్తుంది. ప్రతి 3 నెలలకు వడ్డీ జమ అవుతుంది. రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 2 ఏళ్ల చివరిలో పూర్తి మొత్తాన్ని వడ్డీ రూపంలో పొందవచ్చు.
ఈ పథకాలు ఎందుకు బెటర్? :
సురక్షితమైన ఆదాయాన్ని కోరుకునే మహిళలకు ఈ పోస్టాఫీసు పథకాలు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. రిస్క్ ఉండవు. పన్ను ఆదాకు కూడా చేసుకోవచ్చు. ఉద్యోగ మహిళలు, గృహిణులు కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
లేటెస్ట్ రూల్స్, వడ్డీ రేట్లను పోస్ట్ ఆఫీస్ వెబ్‌సైట్‌లో చెక్ చేయండి. మీకు సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌ను సందర్శించండి. మీ అవసరానికి అనుగుణంగా ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ వడ్డీ రేట్లు జూలై నుంచి సెప్టెంబర్ 2025 వరకు వర్తిస్తాయి.