RBI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుభవార్త చెప్పింది. కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. బేసిస్ పాయింట్లు అంటే వడ్డీ రేటు మార్పులను కొలిచే కనిష్ఠ ప్రమాణం.
ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు 5.25 శాతానికి తగ్గింది. దీంతో ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. బ్యాంకు రుణాలు తీసుకున్న వారికి ఆర్‌బీఐ తాజా నిర్ణయం ఊరట కలిగించనుంది.
డిసెంబరు 3 నుంచి 5 వరకు మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరిగింది. ఇవాళ సమావేశం ముగిశాక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇవాళ వివరాలు తెలిపారు.
Also Read: మన హైదరాబాద్‌లో ఆసియాలోనే అతి పెద్ద బస్ స్టేషన్.. త్వరలోనే..
డిసెంబరు 3 నుంచి 5 వరకు మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత సంజయ్ మల్హోత్రా ఈ ప్రకటన చేశారు.
రేపో రేటును తగ్గించి అమలు చేయాలని ఎంపీసీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘‘ఎంపీసీ డిసెంబరు 3, 4, 5 తేదీల్లో సమావేశమై పాలసీ రేపో రేటుపై చర్చించింది. మ్యాక్రోఎకానమిక్ పరిస్థితులు, ఇతర విషయాలు పరిశీలించిన తర్వాత ఎంపీసీ ఏకగ్రీవంగా పాలసీ రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తక్షణం అమల్లోకి తీసుకురావడానికి ఓటు వేసింది’’ అని అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2 శాతం జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం వంటి బలమైన ఆర్థిక పరిస్థితులు నెలకొన్న వేళ రెపో రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
భారత రిటైల్ ద్రవ్యోల్బణం 2025 అక్టోబరులో రికార్డు స్థాయిలో 0.25 శాతానికి పడిపోయిందని మొస్పి (MoSPI) విడుదల చేసిన డేటా తెలిపింది. అక్టోబరు 1న విడుదలైన మానిటరీ పాలసీ ప్రకటనలో ఆర్‌బీఐ రేపో రేటును 5.5 శాతం చేసిన విషయం తెలిసిందే.
రిజర్వ్ బ్యాంక్ ఈ డిసెంబరు నెలలో ఓఎంఓ (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్) ద్వారా లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు, 5 బిలియన్ యూఎస్ డాలర్ల మూడు సంవత్సరాల డాలర్ రూపీ బై సెల్ స్వాప్ చేసే నిర్ణయం తీసుకుందని మల్హోత్రా చెప్పారు. దీని ద్వారా వ్యవస్థలో మరింత దీర్ఘకాలిక లిక్విడిటీ ఇంజెక్ట్ అవుతుందని అన్నారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే కేంద్ర బ్యాంక్ బాండ్ల కొనుగోలు-అమ్మకాల ద్వారా డబ్బు ప్రవాహాన్ని నియంత్రించే విధానం.
వచ్చే ఏడాది మొదటి అర్ధభాగంలో హెడ్‌లైన్ ఇన్‌ఫ్లేషన్, కోర్ ఇన్‌ఫ్లేషన్ రెండూ 4 శాతం స్థాయిలో లేదా దాని కంటే తక్కువగా ఉంటాయని అంచనా’ వేసినట్లు మల్హోత్రా చెప్పారు. ఎంపీసీ హెడ్‌లైన్ ఇన్‌ఫ్లేషన్ గణనీయంగా తగ్గిందని అన్నారు. దీనికి ప్రధాన కారణం అసాధారణంగా తగ్గిన ఫుడ్ ధరలేనని చెప్పారు.