వరుసగా మూడోసారి వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్: RBI

  • Publish Date - December 4, 2020 / 11:16 AM IST

RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఫలితాలను ప్రకటించింది. ఈ సమావేశం ఫలితాల ప్రకారం.. RBI రెపో రేటులో ఎటువంటి మార్పు లేనట్లుగా ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ వరుసగా మూడోసారి వడ్డీరేట్లలో మార్పులు చేయకుండా కీలక నిర్ణయం తీసుకుంది ఆర్‌బీఐ. ద్రవ్యోల్బణం పెరగడం, జీడీపీ ప్రతికూల స్థాయిలోనే ఉన్న వేళ రెపో రేటును యథాతథంగా 4శాతానికి పరిమితం చేస్తూ RBI నిర్ణయం తీసుకుంది. రివర్స్‌ రెపో రేటు 3.35శాతంగా, బ్యాంక్‌ రేటు 4.25శాతంగా కొనసాగబోతుంది.



ఈ సంవత్సరం GDP వృద్ధి 7.5%గా అంచనా వేయగా.. RBI గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటు, రివర్స్ రెపో రేటును మార్చకూడదని నిర్ణయం తీసుకుంది. RBI గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. 2021లో జిడిపి వృద్ధి 7.5శాతంగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ, పట్టణ డిమాండ్‌లో మెరుగుదల ఉన్నట్లుగా దాస్ వెల్లడించారు. గ్రామీణ డిమాండ్‌లో మెరుగుదల మరింత బలపడుతుందని, పట్టణ డిమాండ్‌లో కూడా మూమెంట్ కనిపిస్తున్నట్లుగా చెప్పారు.



ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరియు వచ్చే ఏడాది స్థిరమైన ప్రాతిపదికన మరియు ద్రవ్యోల్బణ లక్ష్యాలపై వృద్ధిని పునరుద్ధరించేందుకు అకామడేటివ్‌ మోనిటరీ పాలసీ విధానాన్ని కొనసాగిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. వృద్ధిని పెంచేందుకు ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఇదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను సవరించిన ఆర్‌బీఐ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.5శాతంగా ఉండొచ్చునని అంచనా వేసింది.



అక్టోబరులో జరిగిన పరపతి విధాన ప్రకటనలో జీడీపీ వృద్ధిని 9.5శాతంగా అంచనా వేయగా.. ఇప్పుడు దానిని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ పాజిటివ్‌లోకి వచ్చే అవకాశం ఉందని, నాలుగో త్రైమాసికంలో 0.7శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది.ద్రవ్య విధాన సర్దుబాటు వైఖరిని కొనసాగించాలని ఎంపిసి నిర్ణయించినట్లు శక్తికాంత దాస్ తెలిపారు.