RBI Lock Phones
RBI Lock Phones : అబ్బా.. కొత్త ఫోన్ వచ్చింది.. ఈఎంఐలో కొనేద్దాంలే అనుకుంటున్నారా? క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఖరీదైన కొత్త మొబైల్ కొనేస్తుంటారు. కానీ, ఆ కొన్న మొబైల్ ఫోన్ లోన్ చెల్లించడం మానేస్తుంటారు. ఇకపై ఇలా లోన్ చెల్లించడం ఆపేస్తే కుదరదు.. ఇలాంటి లోన్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇకపై మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి ఆ లోన్ చెల్లించకపోతే మాత్రం (RBI Lock Phones) వారి మొబైల్ ఫోన్ లాక్ అయిపోతుంది. కనీసం ఒక ఈఎంఐ మిస్ అయినా సరే మీ ఫోన్ ఇక వాడలేరు. అతి త్వరలో ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఆర్బీఐ ఇలాంటి రుణాలను రికవరీ చేసేందుకు బ్యాంకులకు అధికారం ఇవ్వనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పరిశీలిస్తున్నట్టు నివేదికలు పేర్కొన్నాయి.
దీని ప్రకారం.. రుణఎగవేతదారుల మొబైల్ ఫోన్లను రిమోట్ లాక్ చేసేందుకు బ్యాంకులకు అనుమతించే దిశగా ఆర్బీఐ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో మొండి రుణాలను వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వినియోగదారుల హక్కుల గురించి ఆందోళనలను కూడా లేవనెత్తుతుంది. ముందస్తు అనుమతి, డేటా ప్రొటెక్షన్ తప్పనిసరి చేస్తూ ఫోన్-లాకింగ్ విధానాలపై మార్గదర్శకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌ను అప్‌డేట్ చేయాలని భావిస్తోంది.
నివేదిక ప్రకారం.. మొబైల్ ఫోన్‌లతో సహా భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌లో మూడింట ఒక వంతు కన్నా ఎక్కువ చిన్న మొత్తంలో రుణాలు తీసుకుంటున్నారు. ఇందులో ఎక్కువ భాగం మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. 1.4 బిలియన్లకు పైగా జనాభాగల దేశంలో 1.16 బిలియన్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి.
Read Also : PM Kisan Yojana : రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 21వ విడత విడుదల తేదీ ఇదేనా? దీపావళికి వస్తుందా?
గత ఏడాదిలో ఆర్‌బీఐ బ్యాంకుల రుణాలను ఎగవేసిన కస్టమర్ల ఫోన్‌లను లాక్ చేయడం ఆపమని కోరిందని నివేదిక పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రుణం జారీ చేసే సమయంలోనే ఒక యాప్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఆ యాప్ ద్వారా ఫోన్ లాక్ చేస్తారు. ఇప్పుడు బ్యాంకులతో చర్చల తర్వాత ఆర్‌బిఐ రాబోయే నెలల్లో ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్‌ను సవరించే అవకాశం ఉంది. ఫోన్-లాకింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయొచ్చునని భావిస్తున్నారు.
అంతేకాదు.. రుణగ్రహీతల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి కానుంది. రుణదాతలు లాక్ చేసిన ఫోన్‌లలో వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయకుండా నిషేధించే వీలుంటుంది. “రుణదాతలకు చిన్న రుణాలను తిరిగి పొందే అధికారం ఉందని, అదే సమయంలో కస్టమర్ల డేటా కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ భావిస్తోంది” అని అంటున్నారు.
లో-క్రెడిట్ స్కోరు ఉన్నా రుణాలు :
ఈ నిబంధన అమల్లోకి వస్తే.. బజాజ్ ఫైనాన్స్, డీఎంఐ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ వంటి రుణప్రదాతలు రికవరీని పెంచడం, లో క్రెడిట్ ప్రొఫైల్‌లు ఉన్న కస్టమర్‌లకు కూడా రుణాలు ఇవ్వడం సులభం కావచ్చు. క్రెడిట్ బ్యూరో CRIF హైమార్క్ ప్రకారం.. రూ. లక్ష కన్నా తక్కువ రుణాలకు డిఫాల్ట్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నాన్-బ్యాంకు రుణదాతలు 85 శాతం కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలను కలిగి ఉన్నారు.
ఆర్బీఐ డేటా ప్రకారం.. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో వ్యక్తిగత రుణాలు మొత్తం నాన్-ఫుడ్ క్రెడిట్‌లో మూడింట ఒక వంతు ఉన్నాయి. మొబైల్ ఫోన్‌ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపైనే రుణాలు వేగంగా పెరుగుతున్నాయి. అయితే, ఈ నిబంధన అమలు అయితే.. లక్షలాది మందికి సమస్యలను సృష్టించవచ్చని వినియోగదారుల హక్కుల కార్యకర్తలు హెచ్చరించారు.