RBI Repo Rate : ఆర్బీఐ రెపో రేటు యథాతథం.. వారికి నిరాశను మిగిల్చిన ఆర్బీఐ గవర్నర్ ప్రకటన

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటనతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు నిరాశకు గురయ్యారనే చెప్పొచ్చు.

rbi governor shaktikanta das

RBI MPC Meeting: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం కమిటీ (ఎంపీసీ) సమావేశం నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ప్రకటించారు. రెపో రేటు ను 6.5శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం ఇది వరుసగా పదోసారి. తాజాగా ఆర్బీఐ గవర్నర్ తన ప్రసంగంలో భవిష్యత్​లో వడ్డీ రేట్లు తగ్గిస్తామన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో స్టాక్ మార్కెట్లపై ఆ ప్రభావం కనిపించింది. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి.

Also Read: Haryana: హర్యానాలో కాంగ్రెస్‌ను దెబ్బ‌కొట్టిన ఆప్‌.. క‌లిసి పోటీచేస్తే ఫ‌లితాలు మ‌రోలా ఉండేవా..

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటనతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు నిరాశకు గురయ్యారనే చెప్పొచ్చు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గించిన తరువాత రిజర్వ్ బ్యాంక్ రెపో రేటులో కూడా మార్పులు చేస్తుందని భావించారు. తద్వారా ఇళ్లు, వాహనాలపై రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐలు భారం తగ్గుతుందని కొద్దిరోజుల నుంచి ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకపోవటంతో నిరాశకు గురయ్యారు.

 

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన ఎంపీసీ సమావేశం ప్రతి రెండు నెలలకు ఒకసారి జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తో సహా ఆరుగురు సభ్యులు ద్రవ్యోల్బణం, ఇతర సమస్యలు, మార్పులు గురించి చర్చిస్తారు. బ్యాంకు రుణాలు తీసుకునే కస్టమర్లతో రెపోరేటుకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. రెపో రేటు తగ్గితే రుణ ఈఎంఐ తగ్గుతుంది. రెపో రేటు పెరిగితే ఈఎంఐ పెరుగుతుంది. ఆర్బీఐ రెపోరేటు 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు అనేకసార్లు పెరిగింది. మొత్తం 2.5శాతం పెరిగింది. ఫిబ్రవరి 2023 నుంచి సెంట్రల్ బ్యాంక్ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు.