Reliance Disney Merger : రిలయన్స్-డిస్నీ మీడియా బిగ్ డీల్.. చైర్‌పర్సన్‌గా నీతా అంబానీ.. ఒకేచోటకు మొత్తం 120 టీవీ ఛానళ్లు!

Reliance Disney Merger : రిలయన్స్-డిస్నీ మీడియా మధ్య బిగ్ డీల్ కుదిరింది. మొత్తం 120 టీవీ ఛానళ్లు ఒకేచోటకు చేరనున్నాయి. విలీన సంస్థకు నీతా అంబానీ చైర్‌పర్సన్‌గా ఉండగా, ఉదయ్ శంకర్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.

Reliance, Disney announce merger; Nita Ambani to be chairperson

Reliance Disney Merger : ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త, బిలియనీర్ ముఖేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాల్ట్ డిస్నీ కంపెనీల మధ్య బిగ్ డీల్ కుదిరింది. తమ మీడియా వ్యాపారాలను భారత మార్కెట్లో విలీనం చేసేందుకు రెండు కంపెనీలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా అధికారికంగా ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ బిగ్ డీల్ ద్వారా పరిశ్రమలోని ఇతర సంస్థలను అధిగమించి 8.5 బిలియన్ డాలర్లు (రూ. 70,352 కోట్లు)తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నాయి. తద్వారా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ పవర్‌హౌస్ స్థాపనకు ఇది వేదికగా నిలిచింది.

Read Also : Jio New 5G Smartphone : గుడ్ న్యూస్.. రూ. 10వేల లోపు ధరలో కొత్త జియో 5G స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది!

చైర్‌పర్సన్‌గా నీతా అంబానీ :
ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ గతంలో నివేదించిన విధంగానే ఈ విలీన సంస్థకు చైర్‌పర్సన్‌గా ఉంటారని, ఉదయ్ శంకర్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారని కంపెనీలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఒప్పందంలో భాగంగా.. వయాకామ్ 18 మీడియా సంస్థను కోర్టు ఆమోదించిన స్కీమ్ ద్వారా స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SIPL)లో విలీనం చేస్తామని రిలయన్స్ పేర్కొంది. ఈ విలీన సంస్థలో రిలయన్స్‌ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దాంతో ఈ డీల్‌‌పై ఇప్పటివరకూ వచ్చిన ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడినట్టు అయింది.

రిల్ కంట్రోల్లోనే జాయింట్ వెంచర్ :
మరోమాటలో చెప్పాలంటే.. జాయింట్ వెంచర్ (JV) అనేది వయాకామ్18, స్టార్ ఇండియా కార్యకలాపాలను ఒకచోట చేర్చుతుంది. వయాకామ్18 మీడియా విభాగం కోర్టు-ఆమోదిత పథకం ద్వారా స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం అవుతుంది. విలీనం తర్వాత జేవీని ప్రధానంగా రిల్ (RIL) కంట్రోల్ చేస్తుంది. ఇందులో వయాకామ్18 సంస్థకు 46.82 శాతం యాజమాన్యం, 36.84 శాతం డిస్నీ కలిగి ఉంటుంది. రిలయన్స్, ఇతర అనుబంధ సంస్థలు కలిసి కంపెనీలో 60 శాతం (మెజారిటీ) కన్నా ఎక్కువ వాటాను కలిగి ఉంటాయి. జేవీలో రూ.11,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ అంగీకరించింది.

అదనంగా, నియంత్రణ, థర్డ్ పార్టీ ఆమోదాలకు లోబడి డిస్నీ కొన్ని అదనపు మీడియా ఆస్తులను కూడా జేవీకి అందించవచ్చు. భారత మార్కెట్లో టెలివిజన్, డిజిటల్ స్ట్రీమింగ్ రెండింటిలోనూ రిలయన్స్, డిస్నీ మీడియా విలీన సంస్థ ప్రబలమైన శక్తిగా మారనుంది. వినోదం, క్రీడా డొమైన్‌లలో మీడియా ఆస్తులను కూడా చేర్చనుంది. దేశంలో ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ కంటెంట్ కోసం జాయింట్ వెంచర్ అనేది ప్రముఖ టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా ఉంటుందని కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

ఒకేచోటకు మొత్తం 120 టీవీ ఛానళ్లు :
కలర్స్, స్టార్‌ప్లస్, స్టార్‌గోల్డ్, స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 వంటి ప్రముఖ బ్రాండ్‌లు అన్ని విలీనం కానున్నాయి. అలాగే జియోసినిమా, హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మరిన్ని ఈవెంట్‌లకు యాక్సెస్ అందిస్తుంది. భారత మార్కెట్లో జేవీ ద్వారా 750 మిలియన్ల మంది వీక్షకులను చేరుకోవచ్చని, ప్రపంచ భారతీయ ప్రవాసులకు సేవలందించవచ్చని అంచనా వేస్తోంది. రిలయన్స్-డిస్నీ సంస్థ కలిసి (వయోకామ్ 38 ఛానళ్లు, స్టార్ ఇండియా 70 ఛానళ్లు) మొత్తంగా 120 టీవీ ఛానెల్‌లతో పాటు డిస్నీ హాట్ స్టార్, జియోసినిమా అనే రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఉండనున్నాయి.

సోనీ, నెట్‌ఫ్లిక్స్‌కు బలమైన పోటీదారుగా :
28 బిలియన్ డాలర్ల మీడియా, వినోద రంగంలో జపాన్‌కు చెందిన సోనీ, ఇండియాస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్, నెట్‌ఫ్లిక్స్ వంటి పోటీదారులకు అంబానీ కంపెనీ మరింత బలీయమైన పోటీదారుగా నిలవనుంది. ఈ ఒప్పందంపై రిలయన్స్, డిస్నీ వాటాదారుల నుంచి ఆమోదం పొందాల్సి ఉంది. 2024 చివరి త్రైమాసికంలో లేదా 2025 తొలి త్రైమాసికంలో ఒప్పందం ప్రక్రియ పూర్తి కానుంది. తద్వారా దేశంలోనే అతిపెద్ద మీడియా కంపెనీగా అవతరించినుంది.

డిస్నీతో డీల్.. కొత్త శకానికి నాంది : ముఖేశ్ అంబానీ
ఈ ఒప్పందంపై ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. భారతీయ వినోద పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలికే మైలురాయిగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ మీడియా గ్రూప్‌ డిస్నీతో ఈ వ్యూహాత్మక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలోని ప్రేక్షకులకు సరసమైన ధరలకు కంటెంట్‌ను అందించడానికి సాయపడుతుందని అన్నారు. డిస్నీని రిలయన్స్ గ్రూప్ కీలక భాగస్వామిగా స్వాగతిస్తున్నామని అంబానీ చెప్పారు.

Read Also : Anant Ambani Pre-Wedding : ఆహా.. ఏమి రుచులు.. అంబానీ ఇంట పెళ్లంటే ఆ మాత్రం ఉంటుందిలే.. నోరూరించే 2500 స్పెషల్ వంటకాలు..!

ట్రెండింగ్ వార్తలు