Reliance Jio likely to setup private 5G network for first Tesla factory in India
Reliance Jio 5G Network Tesla factory in India : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) భారత్‌లో టెస్లా కంపెనీ తయారీ ప్లాంట్ (Tesla factory in India) కోసం తమ ప్రైవేట్ 5G నెట్‌వర్క్ సెటప్‌ను ఏర్పాటు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) కంపెనీ టెస్లాతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం, మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ వాహన తయారీదారు భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. దేశంలో టెస్లా మొదటి తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. భారత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. దీంతో భారత్‌లో టెస్లా కంపెనీ అడుగుపెట్టడం ఖాయమే అనే మాట వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో టెస్లా తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. అందులో ప్రైవేట్ 5G నెట్‌వర్క్ తామే అందిస్తామంటూ జియో ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి టెస్లా కంపెనీతో జియో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్ నిర్మిస్తే.. జియో అందించే ప్రైవేట్ 5G నెట్‌వర్క్ ఫ్యాక్టరీ చుట్టూ అవసరమైన కార్యకలాపాలను హైస్పీడ్ గా నిర్వహించవచ్చు. అంతేకాదు.. కనెక్ట్ చేసిన కార్ సొల్యూషన్స్, ఆటోమేటెడ్ ప్రొడక్షన్ ప్రాసెస్‌లకు కూడా జియో 5G సపోర్టు ఇస్తుంది.
టెస్లాతో జియో సుదీర్ఘ చర్చలు..
నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెల్కో ప్రైవేట్ నెట్‌వర్క్ సెటప్ కోసం టెస్లాతో ముందస్తు చర్చలు జరుపుతోంది. దేశంలో తయారీ ప్లాంట్ ఏర్పాటుపై టెస్లా తన ప్రణాళికలను ఖరారు చేయాల్సి ఉంది. అప్పుడు మాత్రమే జియో ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి జియో, టెస్లా మధ్య చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని నివేదిక తెలిపింది. ఆటోమొబైల్, హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, ఇతర పరిశ్రమలలోని సంస్థలకు కూడా జియో తమ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను నిర్మించడానికి, నిర్వహించడానికి 5G వినియోగ కేసులను అందజేస్తోందని నివేదిక పేర్కొంది.
జియో నుంచి క్యాప్టివ్ ప్రైవేట్ 5G నెట్‌వర్క్ సెటప్ ద్వారా కంపెనీలు తమ ప్రాంగణంలో హై స్పీడ్ డేటాను నిరంతరాయంగా వినియోగించుకోవచ్చు. అయితే, కంపెనీల్లో వినియోగించే 5G నెట్‌వర్క్ పబ్లిక్ నెట్‌వర్క్‌లపై ఆధారపడి ఉంటే అది సాధ్యపడదు. ముఖ్యంగా, ప్రైవేట్ 5G సొల్యూషన్‌లు ఇండస్ట్రీలకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి. ఇండస్ట్రీ 4.0 అనేది.. కంపెనీలు తమ ప్రొడక్టులను తయారు చేయడంతో పాటు వాటిని మెరుగుపరచడం, ఆపై పంపిణీ చేసే విధానంలో విప్లవాత్మక మార్పులకు తీసుకొస్తుందని నివేదిక తెలిపింది.
Reliance Jio 5G Network likely to setup private 5G network for first Tesla factory in India
ఇప్పుడు జియో.. అప్పుడు ఎయిర్‌టెల్ :
ప్రైవేట్ 5G నెట్‌వర్క్ సెటప్ కోసం టెక్ కంపెనీలతో చర్చలు జరిపే వాటిలో ఫస్ట్ టెల్కో జియో మాత్రం కాదు. అంతకుముందు, డిసెంబర్ 2022లో, జియో పోటీదారు ఎయిర్‌టెల్ (Airtel) మహీంద్రా అండ్ మహీంద్రా (Chakan) సదుపాయంలో ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్ కోసం 5Gని సెటప్ చేసేందుకు టెక్ మహీంద్రాతో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ సహకారంతోనే మహీంద్రా చకన్ భారత్‌లో 5G రెడీ ఫస్ట్ ఆటో తయారీ యూనిట్‌గా మారింది. ఇప్పుడు, టెస్లా కోసం ప్రైవేట్ 5G నెట్‌వర్క్‌ను సెటప్ చేసే అవకాశాన్ని జియో చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టెల్కోలు, కంపెనీల మధ్య పోటీ వాతావరణం నెలకొంది.
టెస్లాకు సంబంధించి జియో ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే.. ఇప్పటివరకూ టెస్లా తమ తయారీ ప్లాంట్ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వలేదు. టెస్లా ప్రకటన కోసం జియో ఎదురుచూస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. టెస్లా అధికారులు ఇటీవల భారత్‌లో కంపెనీ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను దేశీయ అధికారులతో చర్చించడానికి వచ్చారు. కార్లు, బ్యాటరీల తయారీకి ప్రోత్సాహకాలపై భారత అధికారులతో టెస్లా అధికారులు చర్చించారు.
సొంత నెట్‌వర్క్‌లపై కంపెనీల ఆసక్తి :
మరోవైపు.. తయారీ ప్లాంటలలో ప్రైవేట్ నెట్‌వర్క్ ఏర్పాటుకు టెక్ కంపెనీలు పెద్ద టెలికాం ప్లేయర్‌లపై ఆధారపడటం లేదనే చెప్పాలి. నెట్‌వర్క్‌ను పొందడానికి టెలికాం సర్వీసులపై ఆధారపడకుండా స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. అంతేకాదు.. సొంత Wi-Fi, డేటా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం కంపెనీలను అనుమతిస్తుంది. తద్వారా, కంపెనీలు తమ నెట్‌వర్క్‌లపై మరింత సౌలభ్యం, కంట్రోలింగ్ కలిగి ఉంటాయి. అయితే, టెల్కోలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలా చేస్తే.. టెక్నాలజీ కంపెనీలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు ఉండవని తేల్చి చెబుతున్నాయి. టెలికాం కంపెనీలకు పోటీగా నిలవడం కష్టమని అభిప్రాయపడుతున్నాయి.