2000 rupee notes
RBI 2000 Notes Exchange: మీ దగ్గర పొరపాటున రూ.2వేల నోట్లు ఉన్నాయా.. వాటిని ఎలా మార్చుకోవాలో తెలియడం లేదా.. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. వాస్తవానికి 2023 మే నెలలోనే పెద్ద నోటుగా ఉన్నటువంటి రూ.2వేల నోట్లను సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజల వద్ద ఉన్న 2వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పించింది. దీనికోసం ముందుగా అదే 2023 సెప్టెంబర్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. తర్వాత అదే ఏడాది అక్టోబర్ 7వ తేదీ వరకు గడువును ఆర్బీఐ పొడగించింది.
ఆ తరువాత నుంచి కేవలం దేశంలోని 19 ఆర్బీఐ రీజినల్ కార్యాలయాల్లోనే రూ.2వేల నోట్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే, తాజాగా ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. 2025 ఫిబ్రవరి 28వ తేదీ నాటికి చెలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 98.18 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయని.. ఇంకా రూ.6,471 కోట్ల విలువైన నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయని తెలిపింది. గతంలో.. 2023 మే19న 2వేల రూపాయల నోట్లు వెనక్కి ఇచ్చేయాలని ప్రకటించిన సమయంలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది.
2023 అక్టోబర్ నెల నుంచి కేవలం దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనే 2వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం 2వేల నోట్లు కలిగి ఉన్నవారు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి మార్చుకోవచ్చు. అక్కడి వరకు వెళ్లలేని వారు పోస్టాఫీస్ ద్వారా ఆర్బీఐ ఆఫీసులకు పంపించొచ్చునని ఆర్బీఐ తెలిపింది. రూ.2వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నా.. ఇప్పటికీ చట్టబద్ధ కరెన్సీగా (లీగల్ టెండర్) కొనసాగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే వీటిని రద్దు చేయలేదని ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉన్నట్లు పేర్కొంది.