దేశీయ స్టాక్ సూచీలు ఇవాళ దూసుకెళ్లాయి. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ప్రకటన రావడంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం కనపడింది. అన్ని రంగాలలో భారీగా లాభాలు రావడంతో దేశీయ స్టాక్స్ సూచీలు పైపైకి ఎగిశాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,975 పాయింట్ల (3.74 శాతం పెరిగి) లాభంతో 82,429 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్ 917 పాయింట్లు (3.82 శాతం పెరిగి) లాభపడి 24,925 వద్ద స్థిరపడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, ఎం అండ్ ఎం వంటి కంపెనీలు లాభపడ్డాయి.
Also Read: డోంట్ వర్రీ.. దేశం కోసం 10 శాటిలైట్లు సెకన్ రెస్ట్ కూడా లేకుండా నిఘా: ఇస్రో
బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ సుమారు రూ.16 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో మొత్తం విలువ రూ.432 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. నిన్న ఈ విలువ మొత్తం రూ.416.40 లక్షల కోట్లుగా ఉంది. భారత స్టాక్ మార్కెట్ నాలుగు సంవత్సరాల్లో (ఫిబ్రవరి 2021 నుంచి ఇప్పటివరకు) ఎన్నడూ లేనంతగా (సింగిల్ డే పర్సెంటేజ్‌లో) లాభపడింది.
బీఎస్‌ఈలో 110 స్టాక్‌లు 52 వారాల గరిష్ఠ స్థాయులను తాకాయి. అనుపమ్ రసాయన్ ఇండియా, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, ఆస్టర్ డీఎమ్, భారతి హెక్సాకామ్, సీయట్, ఐసీఐసీఐ బ్యాంక్, నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, రెడింగ్టన్, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా వంటి బీఎస్‌ఈ 500 స్టాక్‌లు ఇవాళ వాటి ఏడాది గరిష్ఠ స్థాయులను తాకాయి. మొత్తం 4,254 స్టాక్స్‌లో 3,542 స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. 579 స్టాక్స్ క్షీణించగా, 133 స్టాక్స్ స్థిరంగా ఉన్నాయి.