డోంట్ వర్రీ.. దేశం కోసం 10 శాటిలైట్లు సెకన్ రెస్ట్ కూడా లేకుండా నిఘా: ఇస్రో
దీంతో భారత్ వెంటనే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.

ISRO Chairman V Narayanan
దేశ ప్రజల భద్రత కోసం అత్యంత కీలకమైన 10 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహాలు నిరంతరం నిఘా పెడుతున్నాయని చెప్పారు. తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇస్రో శాటిలైట్లు భారత భద్రతకు కవచంలా ఉపయోగపడుతున్నట్లు తెలిపారు.
దేశ భద్రత కోసం మన 7 వేల కి.మీ. సముద్ర తీర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని నారాయణన్ చెప్పారు. ఇందుకోసం అత్యాధునిక శాటిలైట్, డ్రోన్ సాంకేతిక ఉండాలని తెలిపారు. ఇవి లేకపోతే భారత్ వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోలేదని చెప్పారు.
ఇస్రోకు చెందిన ఈ 10 ఉపగ్రహాలు సరిహద్దు భద్రతతో పాటు అంతర్గత భద్రత వంటి అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తాయని నారాయణన్ తెలిపారు. దీంతో భారత్ వెంటనే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.
కేవలం దేశ భద్రతకే కాకుండా వ్యవసాయం, టెలీ ఎడ్యుకేషన్, మెడిసిన్, వాతావరణ వివరాలు వంటి అనేక సర్వీసుల్లోనూ ఉపగ్రహాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు నారాయణన్ తెలిపారు. గతంలో విపత్తులు ముంచుకొస్తే చాలా ప్రాణనష్టం జరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు.
ఇప్పటికే భారత్ అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధించిందని, చంద్రయాన్-1 ప్రయోగంతో జాబిల్లిపై నీటి ఉనికిని కనుగొన్న తొలి దేశంగా నిలిచిందని నారాయణన్ తెలిపారు. 34 దేశాలకు సంబంధించిన 433 శాటిలైట్లను మనం విజయవంతంగా ప్రయోగించామని అన్నారు. కాగా, ఇస్రో ప్రస్తుతం గగన్‌యాన్ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టింది.