చైనాలో తయారైన మిసైల్, డ్రోన్లను తుక్కుతుక్కు చేసిన భారత్.. విజువల్స్ చూపిన డీజీఎంవో.. పాక్ మన మీద ప్రయోగిస్తే ఇట్లుంటది..
గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఈ మిసైళ్లు ఛేదిస్తాయి.

ఆపరేషన్ సిందూర్‌పై ఢిల్లీలో భారత త్రివిధ దళాల అధికారులు ఇవాళ కూడా పలు వివరాలు తెలిపారు. మీడియా అడిగిన ప్రశ్నలకు డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారద సమాధానాలు చెప్పారు.
చైనా మిసైల్ పీఎల్ -15లా ఉన్న ఓ క్షిపణికి సంబంధించిన చిత్రాలను డీజీఎంవో చూపించింది. ఈ మిసైళ్లు చైనాలో తయారవుతాయి. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఈ మిసైళ్లు ఛేదిస్తాయి. ఆ మిసైల్‌ను భారత్ కూల్చి వేసింది. దాని శకలాలు మన ఆర్మీకి లభ్యమయ్యాయి. అలాగే, చైనాకు చెందిన యిహా, సోంగార్ డ్రోన్ల శకలాల చిత్రాలను కూడా భారత ఆర్మీ చూపించింది.
ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో పాకిస్థాన్ జోక్యం చేసుకుందని, దీంతో ఆ దేశ చర్యలను తిప్పికొట్టామని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించారు. పీవోకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని ప్రకటించారు. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగాయ యుద్ధం చేసినట్లు తెలిపారు.
నౌకాదళ అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాకిస్థాన్ డ్రోన్లను గుర్తించామని వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు. కేరియర్ బ్యాటిల్ గ్రూప్ సమర్థంగా నిఘా పెట్టిందని చెప్పారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్ యుద్ధ విమానాలను దగ్గరకు రాకుండా అడ్డుకున్నామని తెలిపారు.