Silver Price
Silver Price : దీపావళి ముందు వరకు భారీగా పెరిగిన వెండి ధరలు.. ఆ తరువాత నుంచి క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నాయి. ఫలితంగా గడిచిన ఏడు రోజుల్లో వెండి రేటు 18శాతం తగ్గుదలను నమోదు చేసింది.
దీపావళి ముందు వరకు కిలో వెండి రేటు రూ.2లక్షలకు దాటుకొని సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ప్రస్తుతం కిలో వెండి రూ.1.60లక్షలకు చేరింది. గడిచిన పది రోజుల్లో కిలో వెండిపై సుమారు రూ. 45 నుంచి రూ.50వేల వరకు తగ్గుదల చోటు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ సిల్వర్ రేటు భారీగానే తగ్గింది.
బలమైన పారిశ్రామిక డిమాండ్, చారిత్రాత్మక మార్కెట్ షార్ట్ స్క్వీజ్ కారణంగా 2025 అక్టోబర్ నెల వరకు వెండి ధరలు భారీగా ర్యాలీని చూశాయి. ఈ క్రమంలో విశ్లేషకులు ప్రస్తుతం తగ్గుతున్న రేట్లను ఆరోగ్యకరమైన మార్కెట్ దిద్దుబాటుగా భావిస్తున్నారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తగ్గుదల రేట్ల పతనానికి దోహదపడే అంశం కావచ్చునని మార్కెట్ రిపోర్ట్స్ సూచిస్తున్నాయి.
అస్థిరత ఉన్న కాలంలో వెండి వంటి విలువైన లోహాలు తరచుగా వాటి “సురక్షిత స్వర్గధామం” స్థితి నుంచి ప్రయోజనం పొందుతాయి. కాబట్టి అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వెండికి ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ తగ్గింది. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే.. మరో రెండు నెలల్లో కిలో వెండి రేటు రూ.లక్ష దిగువరకు పడిపోయే చాన్స్ కూడా ఉందని తెలుస్తోంది.