Sovereign Gold Bond
Sovereign Gold Bond : ఈ ఆర్థిక సంవత్సరానికి 6వ విడత సావరిన్ గోల్డ్ బాండ్ల(సార్వభౌమ పసిడి బాండ్లు) జారీ ప్రక్రియ మొదలైంది. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం కొనడానికి ఇది మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మాత్రమే సావరిన్ గోల్డ్ బాండ్స్ సరైన ఆప్షన్ అని తెలిపారు. ఆభరణాల కోసం అయితే ఫిజికల్ గోల్డ్ కొనాల్సి ఉంటుందన్నారు. సావరిన్ గోల్డ్ బాండ్లను భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. భారత ప్రభుత్వం తరపున ఆర్బీఐ బాండ్లను జారీ చేస్తుంది. వీటిని కొనుగోలు చేసేవారు, వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు.
6వ విడతలో ఒక గ్రాము బంగారం ధరను రూ. 4,732గా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా పసిడి బాండ్లను కొనుగోలు చేసే వారికి మరో రూ. 50 తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో స్వచ్ఛమైన బంగారం ఒక గ్రాము ధర రూ.4,849. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే గోల్డ్ బాండ్ కొనొచ్చు. ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు అవకాశం ఉంది. వీటికి సంబంధించిన సర్టిఫికెట్లను సెప్టెంబర్ 7న జారీ చేస్తారు. ఐదో విడత ఇష్యూ ధర రూ.4,790 పోలిస్తే ఈసారి ధర కాస్త తగ్గింది.
ఒక గ్రాము యూనిట్‌గా పరిగణించి బంగారు బాండ్లలో పెట్టుబడి పెడతారు. కనీసం ఒక గ్రాము నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన ధర ఆధారంగా బాండ్లలో పెట్టుబడి పెట్టాలి. 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధర సబ్‌స్క్రిప్షన్‌కు ముందు వారం చివరి మూడు పని దినాల్లో ఉన్న ధరకు సగటు లెక్కించి ధర నిర్ణయిస్తారు.
ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ బాండ్లను జారీ చేస్తుంది. అందువల్ల పెట్టుబడికి హామీ ఉంటుంది. బ్యాంకు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్టాఫీసులు, అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్ఈ)ల దగ్గర అందుబాటులో ఉంటాయి.
ప్రయోజనాలు..
* ప్రస్తుతం సావరిన్ బంగారు బాండ్లలో పెట్టుబడి మొత్తంపై వార్షికంగా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి ఆరు నెలలకోసారి చందాదారుని బ్యాంక్ ఖాతాకు వడ్డీ జమ అవుతుంది. చివరి ఆరు నెలల వడ్డీని మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తంతో కలిపి చెల్లిస్తారు. పసిడి బాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను వర్తిస్తుంది. వడ్డీ ఆదాయాన్ని, వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై మూలం దగ్గర పన్ను (టీడీఎస్) విధించరు.
* సావరిన్ బంగారు బాండ్లకు ఎనిమిదేళ్ల కాలపరిమితి ఉంటుంది. మెచ్యూరిటీ వరకు ఉంచినట్లయితే మూలధన రాబడిపై పన్ను వర్తించదు. మూలధన రాబడిపై పన్ను మినహాయింపు పసిడి బాండ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, భౌతిక బంగారం వంటి ఇతర పెట్టుబడులపై పన్ను మినహాయింపు వర్తించదు.
* మెచ్యూరిటీ సమయంలో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం, చివరి మూడు పని దినాల్లో ఉన్న ధరకు సగటు లెక్కించి దాని ప్రకారం చెల్లింపులు చేస్తారు.
* భౌతికంగా బంగారం కొనుగోలు చేసేవారికి 3 శాతం జీఎస్టీతో పాటు, తయారీ ఛార్జీలు వంటి అదనపు రుసుములు వర్తిస్తాయి. అయితే సార్వభౌమ పసిడి బాండ్లపై జీఎస్టీ వర్తించదు.
* భౌతిక రూపంలో బంగారం కొనుగోలు చేయడం కంటే బాండ్లను కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా బంగారం దాచిపెట్టడానికి అయ్యే ఖర్చు, అదనపు రిస్క్‌లను తగ్గించుకోవచ్చు.
* చందాదారులు 8 సంవత్సరాల కంటే ముందుగానే పథకం నుంచి నిష్క్రమించే అవకాశం కూడా ఉంది. విత్‌డ్రా చేసే సమయానికి ఉన్న బంగారం ధరల ఆధారంగా రాబడి ఉంటుంది. ఎక్స్‌ఛేంజ్‌ల ద్వారా బాండ్లను విక్రయించొచ్చు లేదా జారీ చేసిన తేదీ నుంచి ఐదో సంవత్సరంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ రెండు విధానాల్లోనూ మూలధన రాబడిపై పన్ను వర్తిస్తుంది.