Swiggy Fee Hike
Swiggy Fee Hike : స్విగ్గీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ మరోసారి ఛార్జీలను పెంచేసింది. స్విగ్గీ నుంచి ఇకపై ఫుడ్ ఆర్డర్ చేయడం (Swiggy Fee Hike) కొంచెం కష్టమే.. ఎందుకంటే.. కంపెనీ ప్లాట్‌ఫామ్ రుసుమును రూ.2 పెంచేసింది. అంటే దాదాపు 17శాతం పెంచింది.
ఇప్పుడు స్విగ్గీ కస్టమర్లు ప్రతి ఆర్డర్‌పై ప్లాట్‌ఫామ్ రుసుముగా రూ.14 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ రుసుము రూ. 12 ఉండేది. పండుగ సీజన్ సమయంలో ఆర్డర్లు పెరుగుతున్న క్రమంలో కంపెనీ ఆదాయం పెంచుకునేందుకు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ఫీజులను భారీగా పెంచుతోంది.
2023లో స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజులు :
కంపెనీ యూనిట్ ఎకనామిక్స్‌ను మెరుగుపరుచుకునేందుకు స్విగ్గీ మొదట ఏప్రిల్ 2023లో ప్లాట్‌ఫామ్ ఫీజులను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి స్విగ్గీ ఈ ఫీజును క్రమంగా అనేకసార్లు పెంచింది. ప్రారంభంలో ఈ ఫీజు కేవలం రూ. 2 మాత్రమే. గత ఏడాది కొత్త సంవత్సరంలో ఈ ఫీజును రూ. 12కి పెంచింది.
కేవలం రెండేళ్లలోనే 600 శాతం పెరుగుదల :
ఏప్రిల్ 2023లో రూ.2 నుంచి జూలై 2024లో రూ.6కి పెంచింది. ఆ తర్వాత అక్టోబర్ 2024లో రూ.10కి పెరిగింది. ప్రస్తుతం రూ.14గా ఉన్న ఫీజులు కేవలం రెండేళ్లలోనే 600 శాతం వృద్ధిని నమోదు చేశాయి. స్విగ్గీ రోజుకు 2 మిలియన్ల (20లక్షలకు) పైగా ఆర్డర్‌లను డెలివరీ చేస్తుంది. ప్రస్తుత ప్లాట్‌ఫామ్ ఫీజు స్థాయిలలో రోజుకు కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అయితే, పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజుపై కంపెనీ ఇంకా స్పందించలేదు.
దీని ప్రకారం.. రూ.14 ప్లాట్‌ఫామ్ ఫీజు కంపెనీకి రోజుకు రూ.2.8 కోట్లు. ప్రతి త్రైమాసికంలో రూ.8.4 కోట్లు, ఏటా రూ.33.6 కోట్ల అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.
గత జూన్ త్రైమాసికంలో (Q1 FY26) స్విగ్గీ రూ.1,197 కోట్ల వార్షిక నికర నష్టాన్ని (YoY) నివేదించింది. గత ఏడాదిలో ఇదే కాలంలో (Q1 FY25) నమోదు చేసిన రూ.611 కోట్ల నష్టానికి దాదాపు రెట్టింపు అని చెప్పొచ్చు. త్రైమాసికం-త్రైమాసికం (QoQ) ప్రాతిపదికన గత త్రైమాసికంలో (Q4 FY25) రూ.1,081 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిందని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది.
జొమాటో కూడా రెండేళ్లలోపు 5సార్లు ఛార్జీలను పెంచింది. 400 శాతం మేర పెంచింది. స్విగ్గీ-జొమాటో 35 శాతం వరకు కమీషన్ రేట్లను విధించడంతో రెస్టారెంట్ యజమానులు మెనూ ధరలను పెంచాల్సి వస్తుంది. తద్వారా రెస్టారెంటులో భోజనం చేయడం కన్నా ఆన్‌లైన్ ఆర్డర్‌లు 50 శాతం కన్నా ఎక్కువ ఖరీదైనవిగా మారుతున్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి.