నష్టాల ఊబిలో టెలికాం కంపెనీలు

దేశంలో టెలికాం కంపెనీలు ఇక ఒకటో రెండో మాత్రమే ఉండబోతున్నాయా …వరసబెట్టి కంపెనీలు వేలకోట్ల రూపాయల నష్టాలు ప్రకటించడమే ఇందుకు కారణం. ఇంతకీ టెలికాం కంపెనీల నష్టాలకు కారణమేంటి? ఈ సందేహాలే ఇప్పుడు కలుగుతున్నాయ్. పరిస్థితి కనుక అనుకూలించకపోతే..అసలు ఇండియన్ మార్కెట్ నుంచే జంప్ అవుతామంటూ వొడాఫోన్ సీఈఓ నిక్ రీడ్ చెప్పిన మరుసటి రోజే కంపెనీ రిజల్ట్స్ దారుణంగా వచ్చాయ్. రెండో త్రైమాసికంలో నికర నష్టం ఏకంగా రూ.50,922కోట్లుగా నమోదు చేసింది. గత క్వార్టర్‌లో ఈ నష్టం కేవలం రూ.4873కోట్లు మాత్రమే. ఈ మొత్తం తక్కువ కాకపోయినా..తాజా క్వార్టర్లో ప్రకటించిన నష్టం మాత్రం అమాంతం పెరిగిపోయింది.
ఐతే వొడాఫోన్ ఐడియా నికర నష్టాన్ని తరచి చూసినప్పుడు ఇందులో ప్రధానభాగం అంటే రూ. 30,774కోట్ల ప్రభుత్వానికి కట్టాల్సిన ఏజీఆర్ ఫీజు కింద చూడాలి. అప్పుడు నష్టం 20వేలకోట్లపై చిలుకుగా తేలుతుంది. ఇక రెండో త్రైమాసికంలో వోడాఫోన్ ఐడియా ఆదాయం 3.9శాతం తగ్గి రూ.10,844కోట్లకి పరిమితం అయింది. గత జూన్‌తో ముగిసిన ఫస్ట్ క్వార్టర్ ఆదాయం చూస్తే రూ. 11,270 కోట్లుగా నమోదైంది..
మరో టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ కూడా నికరంగా 23వేల44కోట్ల నష్టాలను ప్రకటించింది. ఈ భారీ నష్టంలో అడ్జస్టడ్ గ్రాస్ రెవెన్యూ ఏజీఆర్ కింద కట్టాల్సిన రూ.28,450కోట్లు కూడా ఉన్నాయ్. అంటే ఈ ఏజీఆర్ కనుక లేకపోతే ఎయిర్‌టెల్ కాస్తో కూస్తో లాభం ప్రకటించే అవకాశం ఉంది..ఏజీఆర్ పద్ధతిన లైసెన్స్, ఇతర ఫీజుల లెక్కించడంపై పై పదేళ్లుగా టెలికాం శాఖ, టెల్కోల మధ్య వివాదం నడుస్తూ ఉంది.. ఈ వివాదంపై టెలీకమ్యూనికేషన్స్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్ టెలికాం కంపెనీలకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది.
దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అక్కడ టెలికం కంపెనీలకు షాక్ తగిలింది. లక్షకోట్లకు పైగా ఏజీఆర్ బకాయిలు.. అసలు, వడ్డీ, జరిమానా కలిపి చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో ఎయిర్ టెల్ రూ.21,700 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.28,300 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఐతే మూడేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన జియో మాత్రం కేవలం 13 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంది.
ఈ నేపధ్యంలోనే టెలికాం కంపెనీల మధ్య పోటీ మరోసారి వాటిని మరింత నష్టాల్లోకి జారుకునేలా చేస్తోంది. దీనికి తోడు ఏజీఆర్ రూపంలో మరో లక్షా నలభైవేల కోట్ల రూపాయల మేర టెలికాం రంగంపై భారీ బండ పడింది..అందుకే టెల్కోలు ఇప్పుడు సుప్రీంకోర్టే తమని అదుకోవాలంటూ కోరుతున్నాయ్.