Hyderabad: హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోలుకు ఇదే సరైన సమయం.. ఎందుకంటే?

హైదరాబాద్ లో ఇల్లు, ఇంటి స్థలం చేయాలనుకుంటున్న వారికి ఇదే సరైన సమయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు.

this is the right time for buy housing properties in hyderabad

Hyderabad Home Buyers: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి షూరూ అయింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో అందరి చూపు అటువైపే వైపు మళ్లింది. తెలంగాణలో ఎన్నికల ప్రభావం రియల్ ఎస్టేట్‌ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. గత రెండు నెలలుగా హైదరాబాద్‌లో నిర్మాణాల వేగం తగ్గింది. కొత్త ప్రాజెక్టుల లాంచింగ్‌లు తాత్కాలికంగా వాయిదా పడుతున్నాయి. తెలంగాణలో ఎన్నికల తరువాతే కొత్త నిర్మాణాలను చేపడతామని చాలా మంది బిల్డర్లు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల్లో కొంతమేర స్తబ్ధత నెలకొంది. గత నెల రోజుల నుంచి ఇళ్ల అమ్మకాలు అనుకున్న మేర జరగడం లేదని రియల్ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు నిర్మాణరంగంలో ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశముందని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు.

ఇక హైదరాబాద్ లో ఇల్లు, ఇంటి స్థలం కొనుగొలు చేయాలనుకుంటున్న వారు కొంత ఆలోచనల్లో పడ్డారు. ఎన్నికలు అయ్యాకే ప్రాపర్టీలను కొనుగోలు చేస్తే మంచిదని చాలా మంది బయ్యర్స్ భావిస్తున్నారు. ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వాన్ని బట్టి ఇంటి ధరలు, ఇంటి స్థలాల ధరలు తగ్గుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది. దీంతో ఎన్నికల వరకు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు కొనుగోలుదారులు. ఇలాంటి ప్రచారంతో సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్న మరికొంత మంది సైతం ఆలోచనల్లో పడ్డారు. ఇంటిని ఇప్పుడు కొనుగోలు చేయాలా, లేదంటే ఎన్నికలు అయ్యే వరకు ఆగాలా అన్న ఆయోమయం చాలా మందిలో నెలకొంది.

అయితే సొంతిల్లు కొనుగోలు చేసేవారికి ఇదే సరైన సమయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో నిర్మాణరంగంలో నెలకొన్న స్తబ్ధతను అవకాశంగా తీసుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఇళ్ల ధరలు కాస్త అందుబాటులోనే ఉన్నాయి. అందులోనూ దేశంలోనే హైదరాబాద్‌లో ఇంటి సగటు చదరపు అడుగు ధర తక్కువగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి.

Also Read: ఓపెన్ ప్లాట్, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ ఏది బెస్ట్‌.. ఎందులో ఇన్వెస్ట్‌ చేస్తే అధిక రిటర్న్స్‌ వస్తాయి?

ఎన్నికల నేపథ్యంలో రియాల్టీ మార్కెట్ స్లోగా ఉందని.. ఇళ్లు కొనేవారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బిల్డర్‌తో సంప్రదింపులు జరిపితే సరసమైన ధరకు ప్రాపర్టీ లభించే అవకాశం ఉంది. అంతే కాదు బిల్డర్‌తో కాస్త బేరం కూడా ఆడొచ్చు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వందల కొద్ది భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు నిర్మాణం పూర్తై అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇల్లు కొనాలనుకుంటున్న ప్రాజెక్టులో మనకు నచ్చిన ఫ్లాట్‌ను ఎంచుకునే చాన్స్ ఈ టైంలోనే దొరుకుతుందంటున్నారు రియల్ రంగ నిపుణులు.

Also Read: ప్రాపర్టీ పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం.. కొంపల్లి, మేడ్చల్‌, శామీర్‌పేట్‌ కారిడార్ బెస్ట్

ప్రస్తుతం ఉన్న ఆర్థిక అనిశ్చితి, ఎన్నికలతో చాలామంది ఇన్వెస్టర్స్‌ వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. ఎన్నికలు ముగిసి మార్కెట్‌ కాస్త కుదురుకోగానే బయ్యర్స్‌ ప్రాపర్టీల కొనుగోలుకు ముందుకు వస్తారని.. దీంతో భూములు, ఇళ్ల ధరలు పైపైకి వెళ్లే అవకాశముందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అందుకే సొంతిల్లు కొనాలనుకునేవారికి ఇదే సరైన సమయమని వారు సూచిస్తున్నారు.