Top 10 Gold ETF : గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తే లాభమా? నష్టమా? భారత్‌లో టాప్ 10 గోల్డ్ ఈటీఎఫ్‌లు ఇవే.. ఫుల్ డిటెయిల్స్..!
Top 10 Gold ETF : గోల్డ్ ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమేనా? బంగారం ధరలతో గోల్డ్ ఈటీఎఫ్స్‌కు లింక్ ఉందా? ఇందులో పెట్టుబడి లాభామా నష్టమా? భారత మార్కెట్లో టాప్ 10 గోల్డ్ ఈటీఎఫ్స్ ఏంటి? పూర్తి వివరాలు మీకోసం..

Top 10 Gold ETFs in India
Top 10 Gold ETF : బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. సాధారణంగా భారతీయ సంస్కృతిలో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పెళ్లి శుభకార్యాల దగ్గర నుంచి పండుగల వరకు బంగారం భారతీయులకు శుభ సూచికంగా భావిస్తారు.
ప్రపంచంలో భారత్ అతిపెద్ద బంగారం దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటిగా నిలిచింది. మారుతున్న కాలంతో పాటు బంగారంలో పెట్టుబడి పెట్టే మార్గాలు కూడా మారాయి. ఇప్పుడు కొనుగోలుదారులు కేవలం ఫిజికల్ గోల్డ్, నగలు లేదా గోల్డ్ కాయిన్స్‌కు పరిమితం కాలేదు. డిజిటల్ గోల్డ్, గోల్డ్ బాండ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ETFs (Exchange Traded Funds) వంటి కొత్త ఆప్షన్లు సైతం భారీగా ప్రజాదరణ పొందాయి.
బంగారంలో పెట్టుబడికి గోల్డ్ ఈటీఎఫ్స్ బెస్ట్ ఆప్షన్ :
గోల్డ్ ఈటీఎఫ్‌లు ఇప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి సులభమైన సురక్షితమైన మార్గంగా చెప్పవచ్చు. వాస్తవానికి, గోల్డ్ ఈటీఎఫ్‌లు అనేవి స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్ చేస్తాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా కొనుగోలు చేయవచ్చు. అలాగే విక్రయించవచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్‌లు ప్రస్తుత ఫిజికల్ గోల్డ్ ధరలతో లింక్ అయిన ఇన్వెస్ట్‌మెంట్ టూల్స్ అని చెప్పవచ్చు. వీటి ద్వారానే బంగారాన్ని బులియన్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు గోల్డ్ ఈటీఎఫ్ బెస్ట్ ఆప్షన్. కానీ ఫిజికల్ గోల్డ్‌తో (నిల్వ, దొంగతనం, కల్తీ) ఇబ్బందులు ఉంటాయి.
ఏఎంఎఫ్ఐ (AMFI) డేటా ప్రకారం.. :
గోల్డ్ ఈటీఎఫ్‌లు గత జనవరిలో అత్యధికంగా నెలవారీ పెట్టుబడులు రూ.3,751 కోట్లుగా నమోదయ్యాయి. గత డిసెంబర్‌లో రూ.640 కోట్లుగా ఉన్నాయి. అంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ అనమాట. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ గత ఏడాదిలో 39శాతం వరకు రాబడిని, 3 ఏళ్లలో 18శాతం వార్షిక రాబడిని అందించాయి.
గత ఏడాదిలోనే బంగారం ధరలు 38శాతానికి పైగా, గత 3 ఏళ్లలో దాదాపు 88 శాతానికి పెరిగాయి. జనవరి 31, 2025 నాటికి వాటి AUM (ఆస్తుల నిర్వహణ) ఆధారంగా టాప్ 10 గోల్డ్ ఈటీఎఫ్స్ జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
భారత్‌లో టాప్ 10 గోల్డ్ ఈటీఎఫ్‌లు ఇవే :
1. నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీఈఎస్ (AUM : రూ. 16,976 కోట్లు)
2. హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్ (AUM : రూ. 8,020 కోట్లు)
3. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటిఎఫ్ (AUM : రూ. 6,993 కోట్లు)
4. కోటక్ గోల్డ్ ఈటీఎఫ్ (AUM : 6,654 కోట్లు)
5. ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ (AUM : 6,573 కోట్లు)
6. యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ ( AUM : రూ. 1,599 కోట్లు)
7. యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్ ( AUM : రూ. 1,304 కోట్లు)
8. ఏబీఎస్ఎల్ గోల్డ్ ఈటీఎఫ్ ( AUM : రూ. 1,023 కోట్లు)
9. డీఎస్‌పీ గోల్డ్ ఈటీఎఫ్ ( AUM : రూ. 722 కోట్లు)
10. మిరే (Mirae) అసెట్ గోల్డ్ ఈటీఎఫ్ (AUM : రూ. 521 కోట్లు)
గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ vs గోల్డ్ ఈటీఎఫ్ మధ్య తేడా ఏంటి? :
గోల్డ్ మ్యూచువల్ ఫండ్లను మ్యూచువల్ ఫండ్ కంపెనీలు నిర్వహిస్తాయి.. గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడతాయి. మీరు SIP ద్వారా కూడా తక్కువ మొత్తంతో గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడ్ చేస్తాయి. వాటి ధరలు ప్రస్తుత బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ కొనడానికి మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఖర్చు నిష్పత్తి గోల్డ్ మ్యూచువల్ ఫండ్ల కన్నా చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే, పెట్టుబడిదారులకు అధిక రాబడి పొందే అవకాశం ఉంటుంది.
గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడితో కలిగే లాభాలు.. నష్టాలేంటి? :
ఈజీ ట్రేడింగ్ : స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. అలాగే అంతే వేగంగా అమ్ముకోవచ్చు.
తక్కువ ఖర్చు : బంగారు ఆభరణాలు లేదా ఫిజికల్ గోల్డ్‌తో పోలిస్తే.. తయారీ ఛార్జీలు, స్టోరేజీ ఖర్చు ఉండదు (మ్యూచువల్ ఫండ్ ద్వారా బంగారాన్ని నిల్వ చేసేందుకు ఖర్చు అవుతుంది. కానీ, పరిమాణాన్ని బట్టి ఉండే అవకాశం ఉంది).
పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ : బంగారం అనేది సురక్షితమైన ఆస్తి. మార్కెట్ క్షీణత సమయాల్లో హెడ్జ్‌గా చూస్తారు.
రిస్క్, బెనిఫిట్స్ ఇవే :
మార్కెట్ అస్థిరత : బంగారం ధరలు తగ్గినప్పుడు బంగారు ఈటీఎఫ్‌ల వాల్యూ కూడా తగ్గుతుంది.
నో డివిడెండ్ : ఇతర పెట్టుబడి ఆప్షన్ల మాదిరిగా కాకుండా గోల్డ్ ఈటఎఫ్‌లు ఎలాంటి డివిడెండ్ లేదా వడ్డీని అందించవు. పూర్తిగా బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది.
ఖర్చులు : అన్ని ఫండ్లు ఒకే విధమైన వ్యయ నిష్పత్తులను కలిగి ఉండవు. మీరు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అదే మొత్తంలో హోల్డింగ్ కోసం వార్షిక ఖర్చులుగా చాలా ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఎవరు పెట్టుబడి పెట్టాలి? :
ముందుగా, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఫిజికల్ గోల్డ్‌పై పెట్టుబడి ఇబ్బందులను నివారించవచ్చు. డీమ్యాట్ అకౌంట్ ఉండి స్టాక్ మార్కెట్ ద్వారా ఎలా ట్రేడింగ్ చేయాలో తెలిసిన వారు పెట్టుబడి పెట్టవచ్చు. తమ పోర్ట్‌ఫోలియోలో డైవర్సిఫికేషన్ కోసం చూసే పెట్టుబడిదారులు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.
బంగారం ధరలు పెరుగుతున్నందున దీర్ఘకాలంలో ప్రయోజనం పొందాలనుకునే వారు ఆభరణాలు లేదా బంగారు కాయిన్స్ ద్వారా పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు. ఇలాంటి వారు గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు.