ట్రంప్ మరో షాక్.. అమెరికా నుంచి డబ్బు పంపే NRIలకు ఝలక్..

ఇప్పటివరకు అమెరికాలో ఎన్నారైలు ఇతర దేశాలకు పంపే డబ్బుపై ట్యాక్స్‌ లేదు.

Donald Trump

అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతిపాదిస్తున్న ఓ కొత్త పన్ను అక్కడ నివసిస్తున్న చాలా మంది ప్రవాస భారతీయులను (ఎన్నారైలను) ఆందోళనకు గురిచేస్తోంది. యూఎస్‌ కాంగ్రెస్‌లో మే 12న రిపబ్లికన్ సభ్యులు ఈ కొత్త పన్నుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా పౌరులు కాని వ్యక్తులు ఇతర దేశాలకు పంపే డబ్బుపై 5 శాతం పన్నును విధించాలన్న రూల్‌ ఇందులో ఉంది.

ఈ రూల్ వల్ల భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ భారత్‌లోని తమ కుటుంబాలకు క్రమం తప్పకుండా డబ్బు పంపే చాలా మంది ఎన్నారైలకు ఇది పెద్ద సమస్యగా మారుతుంది. 2017లో అమెరికా ప్రభుత్వం “ట్యాక్ కట్స్, జాబ్స్‌ యాక్ట్‌” అనే చట్టాన్ని తీసుకొచ్చింది.

దీని ద్వారా ప్రజలకు, వ్యాపారులకు తాత్కాలికంగా పన్ను మినహాయింపులను ఇచ్చింది. వారు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని తగ్గించింది. ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లు ఆ పన్ను కోతలు శాశ్వతంగా ఉండేలా చేస్తుంది. స్టాండర్ట్‌ డిటెక్షన్‌ను పెంచడం, చైల్డ్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను 2028 వరకు 2,500 డాలర్లుగా ఉంచడం వంటి ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ బిల్‌ను చాలా “గొప్పది”గా పేర్కొంటూ దీన్ని త్వరగా ఆమోదింపజేయాలని రిపబ్లికన్ సభ్యులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరుతున్నారు.

Also Read: టర్కీకి మరో షాక్.. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం

ఈ బిల్‌ ద్వారా చేద్దామనుకుంటున్న పనులకు చాలా నిధులు అవసరం అవుతాయి. అందుకోసం అమెరికా సర్కారు తమ పౌరులు కాని వ్యక్తులు ఇతర దేశాలకు పంపే డబ్బుపై 5 శాతం పన్నును విధించాలని నిర్ణయం తీసుకుంటోంది. ఈ కొత్త రెమిటెన్స్ ట్యాక్స్‌ ద్వారా కొన్ని బిలియన్ల డాలర్లు వస్తాయని భావిస్తోంది.

ఈ డబ్బును అమెరికాలో పన్నుల కోతల విధానాన్ని కొనసాగించడం, సరిహద్దు భద్రతా ప్రాజెక్టులకు చెల్లింపులు చేయడం వంటి వాటికి వాడుకోవాలని అక్కడి ప్రభుత్వం అనుకుంటోంది. ఇప్పటివరకు అమెరికాలో ఎన్నారైలు ఇతర దేశాలకు పంపే డబ్బుపై ట్యాక్స్‌ లేదు.

భారత్‌కు ప్రతి ఏడాది ఇతర దేశాలలో నివసిస్తున్న భారతీయుల నుంచి ముఖ్యంగా అమెరికా నుంచి దాదాపు 83 బిలియన్ల డాలర్లు వస్తాయి. అమెరికాలో ట్రంప్ సర్కారు కొత్త పన్నును తీసుకువస్తే భారత్‌లోని తమ కుటుంబ సభ్యులకు ఎన్నారైలు పంపే ప్రతి రూ.1 లక్షలో రూ.5,000ను పన్ను రూపంలో అమెరికా తీసుకుంటుంది.

దీంతో భారత్‌లో ఈ డబ్బుపై ఆధారపడిన కుటుంబాలు నష్టపోతాయి. కుటుంబ సభ్యుల రోజువారీ ఖర్చులు, పిల్లల విద్య, వైద్యం, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు వంటి వాటికి కోసం ఎన్నారైలు ఈ డబ్బును పంపుతుంటారు. మే 26 నాటికి ఈ బిల్లును యూఎస్ కాంగ్రెస్‌లో ఆమోదింపజేయాలని అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే జులై 4 నాటికి పన్ను అమల్లోకి రావచ్చు.