టర్కీకి మరో షాక్.. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం

ఏఐసీడబ్ల్యూఏ మాత్రమే కాదు.. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) కూడా టర్కీలో షూటింగ్‌లను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

టర్కీకి మరో షాక్.. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం

Updated On : May 16, 2025 / 5:57 PM IST

టర్కీలో సినిమా షూటింగులు, కల్చరల్ ప్రోగ్రాంలు చేయడాన్ని పూర్తిస్థాయిలో బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) చెప్పింది. ఇండియన్‌ ఇండస్ట్రీ కార్మికులు, సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులకు ఏఐసీడబ్ల్యూఏ ప్రాతినిధ్యం వహిస్తోంది.

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య దాడులు చెలరేగిన సమయంలో పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్‌లో టర్కీపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే పలు వ్యాపార సంఘాలు టర్కీ నుంచి దిగుమతులు చేసుకోవద్దని నిర్ణయం తీసుకున్నాయి.

ఇప్పుడు ఏఐసీడబ్ల్యూఏ కూడా టర్కీలో షూటింగ్‌లపై పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని నిర్ణయించింది. బాలీవుడ్ సహా ఇతర భారతీయ సినిమాలకు సంబంధించిన షూటింగులు టర్కీలో జరపకూడదని.. వెంటనే ఈ నిర్ణయం అమలులోకి వచ్చే విధంగా ఏఐసీడబ్ల్యూఏ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, భారత నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, దర్శకులు, ఫైనాన్షియర్లు ఇక సినిమాలు, టెలివిజన్, డిజిటల్ కంటెంట్ ప్రాజెక్టులను టర్కీలో చేయడానికి ఇక అనుమతి ఉండదు.

Also Read: కీలక పరిణామం.. హరీశ్ రావుతో కేటీఆర్ భేటీ

ఏఐసీడబ్ల్యూఏ మాత్రమే కాదు.. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) కూడా టర్కీలో షూటింగ్‌లను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. భారత జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు టర్కీ ఇస్తున్న మద్దతు దృష్ట్యా టర్కీలో షూటింగ్‌లు జరపవద్దని భారతీయ సినిమా నిర్మాతలను కోరుతున్నట్లు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ఆ ప్రకటనలో పేర్కొంది.

ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పింది. పాకిస్థాన్‌కు టర్కీ మద్దతుగా ఉన్న నేపథ్యంలో అటువంటి దేశానికి పరోక్షంగా సపోర్టు చేసే, ప్రయోజనం చేకూర్చేలా పెట్టుబడి పెట్టడం, సహకరించడం వంటి చర్యలు భారత చలనచిత్ర పరిశ్రమకు మంచిది కాదని తాము నమ్ముతున్నట్లు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ పేర్కొంది.