×
Ad

Union Budget 2026: రైతుల ఆశలన్నీ బడ్జెట్‌పైనే.. 2026 కేంద్ర బడ్జెట్‌లో పీఎం కిసాన్ సాయం రూ. 8వేలకు పెరుగుతుందా?

Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026పై రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. వ్యవసాయ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో పీఎం కిసార్ ఆర్థిక సాయం మొత్తాన్ని రూ. 8వేలకు పెంచుతారనే ఆశతో రైతాంగం ఎదురుచూస్తోంది.

  • Published On : January 28, 2026 / 06:24 PM IST

Union Budget 2026

  • ఫిబ్రవరి 1న కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రకటన
  • పీఎం కిసాన్ రైతుల్లో బడ్జెట్‌పై భారీ అంచనాలు
  • అతి త్వరలో పీఎం కిసాన్ 22వ విడత విడుదల
  • బడ్జెట్‌లో పీఎం కిసాన్ మొత్తం రూ. 8వేలకి పెరుగుతుందా?

Union Budget 2026 : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. రాబోయే కేంద్ర వార్షిక బడ్జెట్‌పై రైతుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వ్యవసాయ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ భారత్ కేంద్రం బడ్జెట్ లో ఎలాంటి ప్రకటనలు చేయబోతుందా? అని ఆసక్తిగా చూస్తోంది.

ముఖ్యంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) పథకం ఆర్థిక సాయం ఎంత మొత్తంలో పెంచుతారా? అని రైతులు చర్చించుకుంటున్నారు. పీఎం కిసాన్ యోజన కింద బడ్జెట్‌లో ప్రభుత్వం మొత్తాన్ని రూ. 6వేల నుంచి రూ. 8వేలకి పెంచుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. పీఎం కిసాన్ 22వ విడత విడుదల కావాల్సి ఉంది. నివేదికల ప్రకారం.. వచ్చే ఫిబ్రవరిలో పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని అందించే అవకాశం ఉంది.

పీఎం కిసాన్ సాయం రూ. 8వేలకు పెరుగుతుందా? :
ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతులకు వార్షికంగా రూ. 6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఏడాదిలో మూడుసార్లు వాయిదాలుగా నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ అవుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, రైతు సంస్థలు, వ్యవసాయ నిపుణులు ఈ మొత్తం సాయం సరిపోదని భావిస్తున్నారు. అందుకే 2026 బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని ఏటా రూ.8వేలకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.

పీఎం కిసాన్ ఆర్థిక సాయం ఎందుకు పెంచాలి? :
గత కొన్ని ఏళ్లుగా వ్యవసాయ ఖర్చు బాగా పెరిగింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు అన్నీ ఖరీదైనవిగా మారుతున్నాయి. దాంతో సన్నకారు, చిన్న రైతులు కేవలం రూ. 6వేలతో వార్షిక ఖర్చులను భరించడం కష్టంగా మారింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం మొత్తాన్ని పెంచితే రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. అప్పులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

Read Also : Union Budget 2026 : ఫిబ్రవరి 1నే బడ్జెట్.. గతంలో కేంద్ర బడ్జెట్ ఆదివారం ఎన్నిసార్లు సమర్పించారో తెలుసా? దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్..!

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా :

రైతుల ఆదాయం పెరిగితే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. రైతులకు ఖర్చు చేసేందుకు ఎక్కువ డబ్బు ఉంటే గ్రామీణ మార్కెట్లు మరింత చురుగ్గా మారతాయి.

రైతులకే కాకుండా విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఉన్నవారితో సహా గ్రామీణ వ్యాపారాలు, చిన్న వ్యాపారులకు కూడా ప్రయోజనం ఉంటుంది. పీఎం కిసాన్ పంట సాయం కేవలం రైతులకు మాత్రమే పరిమితం కాదు.. మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రయోజనకరంగా మారుతుంది.

2018లో ప్రారంభమైన పీఎం కిసాన్ యోజన :
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డిసెంబర్ 2018లో ప్రారంభమైంది. చిన్న, సన్నకారు రైతులకు కనీస ఆదాయ మద్దతు అందించడం ఈ పథకం ఉద్దేశ్యం. ఇప్పటివరకు కోట్లాది మంది రైతులు ప్రయోజనం పొందారు. ప్రతి వాయిదా డబ్బులు రూ. 2వేలు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా జరుగుతాయి.

అందరి దృష్టి బడ్జెట్ 2026 పైనే :
ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనలు లేనప్పటికీ, అంచనాలు పెరిగాయి. బడ్జెట్ 2026 పీఎం కిసాన్ యోజనలో ఆర్థిక సాయాన్ని పెంచితే రైతులకు భారీ ఉపశమనం కలుగుతుంది.