×
Ad

Union Budget 2026 : మీ జీతానికి పెద్ద ఊరట? 2026 కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులు, మధ్యతరగతివారి కోసం టాప్ 13 పన్ను అంచనాలివే..!

Union Budget 2026: మధ్యతరగతివారితో పాటు జీతాలు పొందే వారికి గుడ్ న్యూస్.. 2026 బడ్జెట్‌లో రాబోయే ప్రకటనలపై పన్నుచెల్లింపుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. పన్ను నియమాలకు సంబంధించి టాప్ 13 అంచనాలపై ఓసారి లుక్కేయండి..

Top 13 expectations for taxpayers ( Image Credit AI)

  • మధ్యతరగతి కోసం కేంద్ర బడ్జెట్ 2026లో భారీ ప్రకటనలు ఉంటాయా?
  • ఫిబ్రవరి 1నే కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రకటన
  • మధ్యతరగతికి ఊరట ఇవ్వనున్న 13 పన్ను ఉపశమనాలేంటి?
  • జీతాలపై పన్ను తగ్గింపులు ఉంటాయా? మధ్యతరగతి ఆశలు నెరవేరేనా?
  • భార్యాభర్తలకు జాయింట్ టాక్స్ ఆప్షన్  

Union Budget 2026: పన్నుచెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. ఫిబ్రవరి 1న కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025 తర్వాత 9వ సారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను, జీఎస్‌టీ రేట్ల కోతలతో 2025లో ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక వెసులుబాటును కల్పించింది. కానీ, ఈసారి పెద్ద మొత్తంలో పన్ను రాయితీలు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, మరో వర్గం నిపుణులు మాత్రం పన్ను రేట్లు తగ్గించకపోయినా పన్ను నిబంధనలను సులభతరం చేయడం, జీతాలపై ఆధారపడే మధ్యతరగతి ఉద్యోగులతో సహా సాధారణ పన్ను చెల్లింపుదారులకు మరిన్ని మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 2026 బడ్జెట్‌కు ముందు వివిధ పరిశ్రమ సంస్థలు, పన్ను నిపుణులు ఆశించే కొన్ని ముఖ్యమైన పన్ను మార్పులపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది.

కేంద్ర బడ్జెట్ 2026లో మధ్యతరగతి జీతాలు పొందే ఉద్యోగులు సహా సాధారణ టాక్స్ పేయర్లు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. భారీ పన్ను రేటు కోతలు లేకున్నా పన్ను వ్యవస్థను మరింత సులభంగా, అర్థవంతంగా మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, వ్యక్తిగత ఆదాయపు పన్ను, మినహాయింపులు, డిడక్షన్లు, ఇతర నిబంధనల్లో ఊరట కలిగించేలా ప్రకటనలు ఉండాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి మార్పులను తీసుకువస్తే.. మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గడమే కాదు.. పొదుపులు, ఖర్చులకు ప్రయోజనకరంగా ఉంటుందని అంచనా. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్ 2026లో పన్ను చెల్లింపుదారులు ఆశిస్తున్న టాప్ 13 కీలక మార్పులు ఏంటి? ఆయా వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. హెచ్ఆర్ఏ ప్రయోజనాలివే :
ప్రస్తుతం, మెట్రో నగరాలకు జీతంలో 50శాతం నాన్-మెట్రో నగరాలకు 40శాతం వరకు HRA మినహాయింపు పరిమితంగా ఉంది. అయితే ఈ మినహాయింపు పరిమితి అనేది వాస్తవ అద్దెలకు సమానంగా లేదు. ప్రస్తుత అద్దెలకు తగినట్టుగా హెచ్ఆర్ఏ నిబంధనలను కూడా సవరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టైర్-2 నగరాల్లో అద్దెలు మెట్రో నగరాలతో పోల్చాలని చెబుతున్నారు.

2. ఎన్ఆర్ఐలకు 182 రోజుల రెసిడెన్సీ రూల్ :
ఎన్ఆర్ఐలు, పీఐఓలు ఎప్పుడైనా భారత్‌కు వచ్చిన సమయంలో వర్తించే 182 రోజుల రెసిడెన్సీ రూల్ తిరిగి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం నిబంధనల కారణంగా రెసిడెన్సీకి సంబంధించి రోజులు, షరతులు పెరిగాయి. దాంతో ఎన్ఆర్ఐలు అనుకోకుండా రెసిడెంట్‌గా మారే పరిస్థితి ఎదురవుతోంది.

Read Also : Union Budget 2026 : టైమ్ మార్చిన ట్రడిషన్.. సాయంత్రం 5 కాదు… ఉదయం 11కే బడ్జెట్ ఎందుకు? బడ్జెట్ టైమింగ్ వెనుక బ్రిటిష్ స్టోరీ ఏంటి?

అంతేకాదు.. విదేశీ ఆదాయంపైనా భారత పన్ను వర్తించే అవకాశం ఉంటుంది. దాంతో పన్ను చెల్లింపుదారుల్లో గందరగోళం, అనిశ్చితి ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పాత 182 రోజుల రెసిడెన్సీ రూల్ తిరిగి తీసుకురావడం ద్వారా ఎన్ఆర్ఐలకు పన్నుకు సంబంధించి క్లారిటీ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

3. హైయర్ స్టాండర్డ్ డిడక్షన్ :
కొత్త పన్ను విధానం కింద జీతం పొందే పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ పొందుతారు. ఈ మొత్తాన్ని రూ. 1.5 లక్షలకు కాకపోయినా కనీసం రూ. 1 లక్షకు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

4. క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను రాయితీ :
2025 బడ్జెట్‌లో సెక్షన్ 87A రిబేట్‌ను రూ. 60వేలకు పెంచడంతో రూ. 12 లక్షల వరకు సాధారణ ఆదాయాన్ని పన్ను రహితంగా మార్చారు. కానీ, ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్ల నుంచి క్యాపిటల్ గెయిన్స్ పొందిన పన్ను చెల్లింపుదారులకు ఒకవేళ వారి మొత్తం ఆదాయం రూ. 12 లక్షలకు మించకపోయినా ఈ రిబేట్ వర్తించదు. ఈ రిబేట్‌ను ఈక్విటీకి కూడా విస్తరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

5. కొత్త విధానంలో ఆరోగ్య బీమా మినహాయింపు :

కొత్త పన్ను విధానం కింద ఆరోగ్య బీమా ప్రీమియంలపై ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని అందించాలని నిపుణులు సూచించారు. ప్రస్తుతం పాత పన్ను విధానం కింద మాత్రమే అందుబాటులో ఉంది.

6. అధిక రుణ వడ్డీ తగ్గింపు :
పెరుగుతున్న ధరలు, పరిమిత పన్ను ఉపశమనం కారణంగా చాలా మంది పన్ను చెల్లింపుదారులకు గృహ కొనుగోలు అందుబాటులో లేదు. నిపుణులు గృహ రుణ వడ్డీ తగ్గింపును రూ. 5 లక్షలకు పెంచాలని సూచించారు. కొత్త పన్ను విధానంలో కూడా ఈ ఉపశమనాన్ని అందించాలని సిఫార్సు చేశారు.

7. అద్దె ఆదాయ లెక్కింపు :
అద్దెకు ఇచ్చిన ఆస్తుల విషయంలో పన్ను చెల్లింపుదారులకు వాస్తవ అద్దె ఆదాయంపై పన్ను విధించాలని నిపుణులు సూచించారు. దీనికి వ్యతిరేకంగా 30శాతం స్టాండర్డ్ డిడక్షన్, మునిసిపల్/స్థానిక పన్నులు, వడ్డీ ఖర్చులకు పూర్తి తగ్గింపును అనుమతించాలి.

8. రెండు TDS రేట్లు మాత్రమే :
టీడీఎస్ అనేది ఆదాయ సేకరణ కోసం కాదు.. ఆడిట్ ట్రయల్‌గా చెప్పొచ్చు. అయితే, ప్రస్తుతం 6 టీడీఎస్ రేట్లు ఉన్నాయి. అందులో 0.1 శాతం, 1 శాతం, 2 శాతం, 5 శాతం, 10 శాతం, 20 శాతంగా ఉన్నాయి. ICAI సూచించిన ప్రకారం.. టీడీఎస్ రేట్లు రెండు (1శాతం లేదా 5 శాతం)గా మాత్రమే ఉండవచ్చు.

9. రియల్ టైమ్ టాక్స్ రీఫండ్ ట్రాకింగ్ :
2025లో ఆదాయపు పన్ను రీఫండ్ ఆలస్యం కారణంగా చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2026 బడ్జెట్ కోసం నిపుణులు ఈ కింది వాటిని సూచిస్తున్నారు. 2026–27 బడ్జెట్ సిఫార్సులలో భాగంగా పన్ను చెల్లింపుదారుల పోర్టల్‌లో రియల్-టైమ్ రీఫండ్ ట్రాకింగ్ డ్యాష్‌బోర్డ్. పన్ను బకాయిలపై వడ్డీతో సమానంగా ఆదాయపు పన్ను రీఫండ్‌పై వడ్డీని అందించాలని అంటున్నారు.

10. అదనపు సర్‌ఛార్జ్ పన్ను:
కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లలో మార్పులు ఉన్నప్పటికీ సర్‌చార్జ్ పరిమితిని మార్చలేదు. సర్‌ఛార్జ్ మొత్తం ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. కొత్త పన్నువిధానంలో ఉన్నవారికి ఇది ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి తగ్గింపు ఉండదు. రూ. 50 లక్షల కన్నా ఎక్కువ (రూ. 2 లక్షలు) చిన్న పెంపు కూడా మొత్తం పన్ను బాధ్యతపై 10శాతం సర్‌ఛార్జ్‌ను పెంచుతుంది. అందుకే కొత్త పన్ను విధానంలో సర్‌ఛార్జ్ కోసం థ్రెషోల్డ్ ఆదాయాన్ని రూ. 50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

11. బంగారం, వెండిపై హోల్డింగ్ టైమ్ తగ్గింపు :
ప్రస్తుతం, బంగారం ఈటీఎఫ్స్ కేవలం ఒక ఏడాది తర్వాత దీర్ఘకాలిక ఆస్తులుగా మారుతాయి. అయితే, ఇంట్లో దాచుకునే బంగారంపై మ్యూచువల్ ఫండ్స్ రెండు ఏళ్ల కన్నా ఎక్కువ కాలం ఉంచితే మాత్రమే దీర్ఘకాలిక ఆస్తులుగా మారుతాయి. అందుకే ఫిజికల్ గోల్డ్ హోల్డింగ్ వ్యవధిని ఒక ఏడాదికి తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఈటీఎఫ్స్ కు సమానంగా ఉంటాయి.

12. భార్యాభర్తలకు జాయింట్ టాక్స్ ఆప్షన్ :

ఒకే కుటుంబంలో భార్యాభర్తల కోసం ఆప్షనల్ జాయింట్ టాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఐసీఏఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం, పెళ్లి అయిన వారిని ప్రత్యేక పన్ను చెల్లింపుదారులుగా పరిగణిస్తున్నారు. అంటే వీరంతా వ్యక్తిగత రిటర్న్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఈ కొత్త పన్ను విధానం భార్యాభర్తలిద్దరూ సంపాదించే కుటుంబాలకు అద్భుతంగా ఉంటుంది. అయితే, ప్రస్తుత పన్ను వ్యవస్థను పరిశీలిస్తే.. ఒకే ఆదాయ కుటుంబాలు లేదా దంపతుల్లో ఒకరు మరొకరి కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న కుటుంబాలకు తక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇలాంటి సందర్భాలలో మొత్తం పన్ను భారం ఒక వ్యక్తిపైనే పడుతుంది. ఫలితంగా ఒకరి ఆదాయాన్ని అధిక పన్ను స్లాబ్‌లకు వర్తిస్తుంది. ఇకపై అలా కాకుండా ఒకే కుటుంబంలో ఇద్దరూ సంపాదించిన ఒకే టాక్స్ చెల్లించేలా ఉమ్మడి పన్ను విధానం తీసుకురావడం అధిక ప్రయోజనాలను అందిస్తుందని ఐసీఏఐ సూచించింది. ఇలాంటి వ్యవస్థ ఇప్పటికే అమెరికా, యూకేలలో అందుబాటులో ఉంది.

13. NPS మార్పులివే :
సెక్షన్ 17(1)(viii) చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగి NPS అకౌంట్లలో చెల్లించే మొత్తాన్ని పన్ను ఆదాయంలో వేతనంగా చేర్చారు. అయితే, ఆర్థిక చట్టం 2020 ‘పెర్క్విజిట్’ దీన్ని సవరించింది. కొన్ని పరిస్థితులలో ఇలాంటి కాంట్రిబ్యూషన్ కూడా చేర్చేందుకు వీలు కల్పించింది. అయితే ఇది గందరగోళాన్ని సృష్టించడంతో పాటు డబుల్ టాక్సేషన్‌కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి బడ్జెట్ 2026 దీనికి ముగింపు పలికాలని డిమాండ్ వినిపిస్తోంది.