Union Budget 2026 ( Image Credit to Original Source)
Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026కు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ వరుసగా 9వసారి ప్రవేశపెట్టనున్నారు. అయితే, రాబోయే బడ్జెట్ ముందు ఆర్థిక సర్వేను నిర్వహిస్తారు. ఆ తర్వాతే బడ్జెట్ ప్రకటిస్తారు. ప్రతి ఏడాది ఇదే జరుగుతుంది. ముందుగా దేశ ఆర్థిక పరిస్థితిని సూచించేలా ఆర్థిక సర్వేను సమర్పిస్తారు.
ప్రభుత్వ విధానానికి సంబంధించి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఏడాది మాదిరిగానే, బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో సమర్పిస్తారు. విధాన రూపకర్తలు, శాసనసభ్యులు, సాధారణ ప్రజలకు ప్రస్తుత దేశీయ ఆర్థిక స్థితి, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై పూర్తి వివరాలతో ఉంటుంది.
ఆర్థిక సర్వే అంటే ఏంటి? :
ఆర్థిక సర్వే అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం. ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) మార్గదర్శకత్వంలో రూపొందించే వార్షిక నివేదిక. ఈ నివేదిక గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉంది అనేది వివరణాత్మక విశ్లేషణతో అందిస్తుంది.
భవిష్యత్తు అవకాశాలను హైలైట్ చేస్తుంది. అంతేకాదు.. వ్యవసాయం, పరిశ్రమ, సేవలు, ఎగుమతులు, ఉపాధి, ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు, ఆర్థిక వృద్ధి వంటి కీలక సూచికల డేటా ఆధారిత అధ్యయనాన్ని అందిస్తుంది.
బడ్జెట్, ఆర్థిక సర్వేకు మధ్య తేడా ఏంటి? :
కేంద్ర బడ్జెట్ ప్రభుత్వ ఆదాయ, వ్యయ ప్రణాళికలను ప్రస్తావిస్తుంది. అయితే, ఆర్థిక సర్వే ఒక విశ్లేషణాత్మక డాక్యుమెంట్ అని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవస్థ స్థితి, నష్టాలపై అంచనా వేస్తుంది. విధాన రూపకల్పనలో ప్రభుత్వానికి మార్గదర్శకత్వం అందిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఆర్థిక సర్వే బడ్జెట్‌కు మార్గదర్శకంగా ఉంటుంది.
బడ్జెట్‌కు ముందే ఎందుకు ప్రవేశపెడతారంటే? :
సాంప్రదాయకంగా, బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఈ ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పిస్తారు. ప్రభుత్వ విధానాల వెనుక ఉన్న ఆర్థిక హేతుబద్ధత, ప్రాధాన్యతలను స్పష్టం చేయడమే దీని ఉద్దేశ్యం. ఈ సర్వే రిపోర్టు ఆర్థిక విజయాలు, మరెన్నో సవాళ్లను ప్రభావితం చేస్తుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంస్కరణలు, వ్యయ ప్రణాళికలకు సంబంధించి సూచనలను అందిస్తుంది.
జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ వంటి కీలక ఆర్థిక సూచికలు ఉంటాయి. వ్యవసాయం, పరిశ్రమ, సేవల రంగాల పనితీరు, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సామాజిక, అభివృద్ధి సూచికలు, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా విధాన సిఫార్సులు ఉంటాయి. సంక్లిష్ట ఆర్థిక ధోరణులలతో డేటా, గ్రాఫ్‌లు, విశ్లేషణాత్మక వివరాల ద్వారా సరళమైన పద్ధతిలో సర్వే ఉంటుంది.
ఆర్థిక సర్వేను ఎప్పుడు ప్రవేశపెడతారు? :
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను జనవరి 29న పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశపెడతారు. ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ ఈ సర్వేను సమర్పిస్తారు. చాలా సంవత్సరాలలో బడ్జెట్ తేదీని సవరించకపోతే సాంప్రదాయకంగా కేంద్ర బడ్జెట్‌కు (ఫిబ్రవరి 1న) ఒక రోజు ముందు జనవరి 31న సమర్పిస్తారు.
2026 కేంద్ర బడ్జెట్ ఎప్పుడంటే? :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ 2026ను ప్రవేశపెడతారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఆదాయం, వ్యయం, పన్ను ప్రతిపాదనలను ఇందులో వివరంగా వివరించనున్నారు.
ఆర్థిక సర్వే ప్రజెంటేషన్ లైవ్ ఎక్కడ చూడాలి? :
ఆర్థిక సర్వే ప్రజెంటేషన్‌ను సంసద్ టీవీ, దూరదర్శన్ లైవ్ టెలిక్యాస్ట్ చేస్తాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లైవ్ స్ట్రీమింగ్, అప్‌డేట్ కూడా అందిస్తాయి. అనేక నేషనల్ న్యూస్ ఛానెల్‌లు కూడా లైవ్ స్ట్రీమ్ అందిస్తాయి.