What is Amrit Bharat Express_ Indian Railways’ new train with sleeper
Amrit Bharat Express : సామాన్యుల కోసం భారత రైల్వే శాఖ సరికొత్త రైల్వే సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. వందే భారత్ తరహాలో అమృత్ భారత్ అనే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను త్వరలో ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ శరవేగంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అత్యంత వేగవంతమైన ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ సర్వీసును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న జెండా ఊపి ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది గతంలో వందే సధారన్ అని పిలిచేవారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం :
వందేభారత్ శైలిలో ఏరోడైనమిక్ డిజైన్‌తో లోకోమోటివ్‌లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. భారతీయ రైల్వే నిర్వహించబోయే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసు నాన్-ఎసి స్లీపర్ కమ్ అన్‌రిజర్వ్‌డ్ క్లాస్ సర్వీస్‌గా చెప్పవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాలకు సేవలందించేలా ఈ సర్వీసును రూపొందించారు. ప్రత్యేకించి సామాన్యుల (ఆమ్ ఆద్మీ) కోసం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా వేగంగా చేయడానికి భారతీయ రైల్వే ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తోంది.
Read Also : Flipkart Winter Sale : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.42,500 తగ్గింపు.. డోంట్ మిస్!
గంటకు 130 కిలోమీటర్ల గరిష్ట వేగం :
ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లే పుష్-పుల్ రైలు.. ముఖ్యంగా వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అయితే, వందే భారత్ రైళ్లలా కాకుండా.. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ లోకో-హౌలింగ్ కలిగి ఉంటుంది. ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు నారింజ, బూడిద రంగులలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ‘పుష్-పుల్’ ఆపరేషన్ కోసం రైలు ప్రతి చివర 6వేల హెచ్‌పీతో డబ్ల్యూఏపీ5 లోకోమోటివ్‌ను కలిగి ఉంది.
పుష్-పుల్ రైలుతో అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. వేగవంతమైన ప్రయాణం.. ఫలితంగా సామాన్యుల ప్రయాణ సమయం తగ్గుతుంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 22 కోచ్‌లు, రిజర్వ్ చేయని ప్రయాణికుల కోసం 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 12 సెకండ్ క్లాస్ 3-టైర్ స్లీపర్ కోచ్‌లు, రెండు గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. వేరొకదానిలో దివ్యాంగ ప్రయాణికులు, మహిళల కోసం ప్రత్యేకమైన సదుపాయాలు ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలివే :
అమృత్ భారత్ తయారీ ఎక్కడంటే? :
అమృత్ భారత్ రైళ్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారయ్యాయి. అమృత్ భారత్ రైళ్లు నాన్-ఏసీ ప్రయాణీకులకు రైలు ప్రయాణ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సీల్డ్ గ్యాంగ్‌వేలు, మెరుగైన టాయిలెట్ సౌకర్యాలు ఆకర్షణీయంగా ఉన్నాయని ఐసీఎఫ్ జీఎం బీజీ మాల్య చెప్పారు.
Amrit Bharat Express
మొదటి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును యూపీలోని అయోధ్య నుంచి బీహార్‌లోని దర్భంగా వరకు నడపాలని భావిస్తున్నారు. రెండో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దక్షిణ భారతదేశంలోని బెంగళూరు నుండి మాల్దా మార్గంలో నడిచే అవకాశం ఉంది. ఈ రెండు రైళ్లను రాముడు, సీతాదేవితో ముడిపడి ఉన్న రెండు ప్రదేశాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని నడపనున్నారు.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అంటే ఏమిటి? :
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది కొత్త భారతీయ రైల్వే రైలు. ఈ రైలు ప్రతి చివర రెండు లోకోమోటివ్ ఇంజన్లతో పుష్-పుల్ ఆపరేషన్‌లో నడుస్తుంది.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఏ రూట్లలో నడుస్తుంది? :
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ మొదట రెండు మార్గాల్లో నడపాలని భావిస్తున్నారు. అయోధ్య నుంచి దర్భంగా, బెంగళూరు నుంచి మాల్దా వరకు..
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ ఏమిటి? :
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఆమ్ ఆద్మీకి కొత్త రైలు. ఇందులో 22 నాన్-ఏసీ కోచ్‌లు ఉన్నాయి. 12 స్లీపర్ సెకండ్ క్లాస్ 3-టైర్ కోచ్‌లు, రిజర్వ్ చేయని ప్రయాణికుల కోసం 8 జనరల్ క్లాస్ కోచ్‌లు,2 గార్డు క్యాబిన్‌లు ఉన్నాయి.
అమృత్ భారత్ సేవలు ప్రారంభం ఎప్పుటినుంచి? :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30, 2023న మొదటి రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వందే సధారన్ కంటే భిన్నంగా ఉందా? :
సామాన్యుల కోసం తయారు చేసిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని ఫీచర్లతో కూడిన నాన్-ఏసీ రైలు. డిజైన్ దశలో మొదట వందే సధారన్ అని పిలిచేవారు.