Real Estate Investment in India
Real Estate Investment in India: పోస్ట్ కోవిడ్ తర్వాత పెట్టుబడి తీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. కోవిడ్ మహమ్మారితో హఠాత్తుగా వచ్చే కష్టాలను తట్టుకుని ఆర్థికంగా బలపడాలనే ఓ గుణపాఠం నేర్చుకున్నాం. దీంతో ఆర్థికంగా ఎలా ఎదగాలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాం. ఆరోగ్యపరంగానే కాదు ఆర్థికపరంగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కష్టపడి సంపాదించిన డబ్బును సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతిలో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. దీంతో ఏ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేస్తే భద్రతతో పాటు అధిక రాబడి వస్తుందని చాలామంది సమాలోచనలు చేస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన అనేక సర్వేల్లో స్టాక్ మార్కెట్లు, బంగారం, రియల్ ఎస్టేట్, బిట్ కాయిన్ వంటి రకరకాల పెట్టుబడి సాధనాలలో రియల్ రంగమే అత్యంత సురక్షితమైన, అధిక రాబడి మార్గంగా తేలింది. భారతీయుల్లో మెజార్టీ ప్రజలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారని నరెడ్కో-హైజింగ్ డాట్‌కామ్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. లాంగ్‌టర్మ్‌లో రియల్ ఎస్టేట్‌లో వచ్చే రాబడులు మరే రంగంలోనూ రావని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు.
తాజాగా నిర్వహించిన సర్వేలో సురక్షితమైన పెట్టుబడి విధానాల్లో తొలిస్థానంలో రియాల్టీ రంగం నిలువగా… రెండో స్థానంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మూడో స్థానంలో స్టాక్ మార్కెట్, నాల్గో స్థానంలో గోల్డ్ నిలిచాయి. భారతీయుల్లో 48 శాతం మంది రియల్టీ రంగమే ఉత్తమ పెట్టుబడి సాధనమని అభిప్రాయ పడ్డారు. 19 శాతం మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 18 శాతం మంది స్టాక్‌మార్కెట్, 15 శాతం మంది బంగారానికి తమ ప్రాధాన్యమని తెలిపారు. లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం రియల్ ఎస్టేట్ రంగాన్ని మించిన రంగం మరొకటి లేదనే అభిప్రాయాలున్నాయి.
వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ పని విధానం కొనసాగుతుండటం, రియల్ ఎస్టేట్ డెవలపర్ల ఆఫర్లు, బ్యాంకు వడ్డీ రేట్ల కారణంగా చాలా మంది తమ పెట్టుబడులను ప్రాపర్టీలు కొనేందుకు వెచ్చిస్తున్నారు. బడ్జెట్‌కు అనుగుణంగా విల్లాలు, ఓపెన్ ఫ్లాట్లు, ఫామ్‌ల్యాండ్స్ వంటి ప్రాపర్టీలను కొంటున్నారు. ఇంటికి అద్దెలు వస్తాయని కొందరు, దాంతో పాటూ స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుందని మరికొందరు రియాల్టీ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు. హైదరాబాద్‌లో అయితే ఇతర ప్రాంతాల్లో నివాసమున్నవారు సైతం పిల్లల భవిష్యత్తు కోసం ఐటీ కారిడార్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు.
Also Read: ఎన్నికలయ్యాకే ఇళ్లు కొంటామంటున్న బయ్యర్లు.. ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారు?
ఇళ్లు ఇక్కడ ఒకింత ఖరీదే అయినా ఆస్తి విలువ సైతం అదే స్థాయిలో పెరుగుతుందనే ఉద్దేశ్యంతో కొనుగోలు చేస్తున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు. రియాల్టీ రంగంలో పెట్టుబడి పెడితే ప్రతి ఏడాది 10 నుంచి 20 శాతం ప్రాపర్టీ విలువ పెరిగే అవకాశముందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. దీంతో ఇప్పటికే సొంతిల్లు ఉన్నవాళ్లు సైతం మరో ప్రాపర్టీని కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. సుమారు 43 శాతం మంది వినియోగదారులు పెట్టుబడి రీత్యా రెండో ఇంటి కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారని ఇటీవలి సర్వేలో తేలింది.
Also Read: రియాల్టీ రంగంలో దూసుకుపోతోన్న హైదరాబాద్.. అనరాక్ లేటెస్ట్ రిపోర్ట్
మార్కెట్లో ఉన్న ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో దీర్ఘకాలానికి పెట్టే పెట్టుబడులు ఎంతో సురక్షితమైనవని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ రంగంలో కళ్లముందే మన పెట్టుబడి రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ వేగంగా డెవలప్ అవుతోన్న విశ్వనగరంలో రియాల్టీ ధరలు పెరగడమే తప్పా తగ్గడమన్నదే ఇప్పటివరకు జరగలేదు. ఆర్థిక సంక్షోభ సమయంలోనూ ఇబ్బందులు తక్కువగానే ఉన్నానని 82శాతం మంది అభిప్రాయపడ్డారంటే ఈ రంగంపై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే ముందు సరైన ప్రాంతం, నమ్మకమైన డెవలపర్, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న బిల్డర్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యమని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.