అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR) బకాయిల చెల్లింపులపై టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలంటూ టెల్కోలు వేసిన పిటీషన్‌ను సుప్రీం కొట్టివేసింది. బాకీల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవద్దంటూ డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) అధికారి నోటీఫికేషన్ జారీ చేయడంపై కోర్టు చివాట్లు పెట్టింది. దాంతో జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ముగ్గురు జడ్జీల ధర్మాసనం టెలికం కంపెనీలు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. డాట్ విడుదల చేసిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని కోర్టు ఆదేశించింది.
మొత్తం 15 సంస్థలు.. రూ.1.47 లక్షల కోట్లు బకాయిలు :
గడువు తేదీ జనవరి 23లోగా బకాయిలు కట్టని పక్షంలో టెల్కోలను బలవంతం చేయరాదంటూ గతనెలలో డాట్ అధికారి ఒకరు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డాట్ లెక్కల ప్రకారం.. మొత్తం 15 సంస్థలు.. కేంద్రానికి రూ. 1.47 లక్షల కోట్ల బాకీలు కట్టాల్సి ఉంది. కోర్టు తీర్పుపై స్పందించిన డాట్.. శుక్రవారం 11.59 గంటలలోపు లోపు ఏజీఆర్ , స్పెక్ట్రమ్ యూసేజ్ బకాయిలన్నింటినీ చెల్లించాలని వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లను ఆదేశించింది. బకాయిలు కట్టని టెల్కోలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ గత నెల 23న జారీ చేసిన ఉత్తర్వును వెనక్కి తీసుకుంది.
వోడాఫోన్ రూ. 53 వేల కోట్లు.. ఎయిర్ టెల్ రూ.21వేల కోట్లపైనా :
వోడాఫోన్ ఐడియా దాదాపు రూ.53వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. వోడాఫోన్ ఐడియా మూతపడే పరిస్థితికి చేరుకుంది. మరోవైపు భారతీ ఎయిర్ టెల్ రూ.21వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. సకాలంలో బకాయిలు చెల్లించకుండా ఎయిర్ టెల్ కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. టెలికంయేతర కంపెనీలు కూడా భారీగా చెల్లించాల్సిన మొత్తం రూ.3 లక్షల కోట్ల బకాయిలతో సతమతమైపోతున్నాయి.
టెలికం రంగంలో వోడాఫోన్ ఐడియా నిష్ర్కమిస్తే.. ఈ రెండే టెలికం సామ్రాజ్యాన్ని శాసిస్తాయి. తమకు మరో పోటీ లేకపోవడంతో టెలిఫోన్, మొబైల్, డేటా బిల్లులు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకూ తక్కువ ధరకే డేటాను పొందుతూ వచ్చిన వినియోగదారులపై మరిన్ని టారిఫ్ ల భారం పడే అవకాశం ఉంది.
వోడాఫోన్ – ఐడియా నిష్ర్కమిస్తే :
ఇలాంటి పరిస్థితుల్లో వోడాఫోన్ నిష్ర్కమిస్తే.. ఎయిర్ టెల్-రిలయన్స్ జియో టెలికం రంగంలో ద్విధాధిపత్యాన్ని ప్రదర్శించునున్నాయి. తద్వారా ఫోన్ బిల్లులు భారమైపోతాయి. ఇప్పటికే మొబైల్ టారిఫ్ ధరలను పెంచేసిన టెలికం దిగ్గజాలు ఇకపై డేటా ధరలతో పాటు మరిన్ని ఛార్జీలు వినియోగదారులపై భారం మోపే అవకాశాలు కనిపిస్తాయి.
టెలికం కంపెనీలు బకాయిలు చెల్లిస్తే ప్రభుత్వ ఖజానాలో ఒక్కసారిగా నిధులు వచ్చి పడతాయి. ప్రభుత్వానికి AGR రూపంలో చెల్లించిన మొత్తాన్ని తిరిగా రాబట్టుకోవాలంటే టెలికం కంపెనీలు తమ సర్వీసులపై ఛార్జీలు అమాంతం పెంచే అవకాశం లేకపోలేదు. దీంతో టెలికం కస్టమర్లకు మాత్రం ఫోన్ బిల్లలతో తడిసిమోపడు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
Read Here>>ఓ భర్త వీర ప్రేమగాథ: భార్య శవం పక్కనే నిద్ర..నేను చచ్చే వరకూ ఇంతే..