×
Ad

గుడ్‌న్యూస్‌.. బేస్‌ ఇంపోర్ట్‌ ధరను తగ్గించిన ప్రభుత్వం.. బంగారం, వెండి ధరలు ఇక తగ్గిపోతాయా? కొంటున్నారా ఏంటి?

బేస్‌ ధర తగ్గిస్తే దిగుమతిదారులపై పన్ను భారాన్ని తగ్గించొచ్చు. దీంతో దేశీయ మార్కెట్‌లో ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది.

Gold: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి బేస్‌ ఇంపోర్ట్‌ ధరను తగ్గించింది. 10 గ్రాముల గోల్డ్‌కు బేస్‌ ఇంపోర్ట్‌ ధరను రూ.3,728, వెండికి కిలోకు రూ.9,500 మేరకు తగ్గించింది.

ప్రపంచ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల ఊగిసలాట మధ్య ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికీ ఈ తగ్గింపు ఉపయోగపడుతుంది. (Gold)

Also Read: కల్వకుంట్ల కవిత న్యూ లుక్, న్యూ స్టైల్‌.. కట్టూబొట్టూ మార్చేసి.. ఖరీదైన వాచ్‌కు బదులు మట్టి గాజులు.. ఎందుకంటే?

బేస్‌ ఇంపోర్ట్‌ ధర అంటే ఏంటి?

బేస్‌ ఇంపోర్ట్‌ ధర అనేది దిగుమతి సరుకులపై కస్టమ్స్‌ డ్యూటీ (సుంకం)ని లెక్కించడానికి ప్రభుత్వం నిర్ణయించే ప్రామాణిక ధర. కస్టమ్స్‌ డ్యూటీ అంటే విదేశాల నుంచి వస్తువులు తెచ్చేప్పుడు చెల్లించాల్సిన పన్ను. ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఈ ధరను అప్‌డేట్‌ చేస్తుంది. బేస్‌ ధర తగ్గిస్తే దిగుమతిదారులపై పన్ను భారాన్ని తగ్గించొచ్చు. దీంతో దేశీయ మార్కెట్‌లో ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది.

బంగారంలో రెండో అతిపెద్ద దిగుమతిదారుగా భారత్

భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉంది. ప్రజలు నగల తయారీకి, పెట్టుబడిగా బంగారాన్ని కొంటుంటారు. బేస్‌ ధర తగ్గడంతో బంగారం దిగుమతులు తగ్గుతాయి. దీంతో వినియోగదారులకు నేరుగా లాభం కలుగుతుంది. చైనా ప్రపంచంలో అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉంది. వెండి దిగుమతిలో భారత్‌ నం.1గా ఉంది.

బంగారాన్ని భారత్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది?

భారత్‌ బంగారాన్ని ఎక్కువగా స్విట్జర్లాండ్‌ నుంచి తెచ్చుకుంటుంది. మొత్తం దిగుమతులలో 40 శాతం స్విట్జర్లాండ్‌ నుంచే వస్తుంది. ఆ తర్వాత యూఏఈ నుంచి అధికంగా కొంటుంది. భారత్‌ బంగారం అవసరాల్లో 16 శాతం అక్కడి నుంచే వస్తుంది. భారత్‌ బంగారం దిగుమతుల్లో దక్షిణ ఆఫ్రికా నుంచి వచ్చే గోల్డ్ 10 శాతం. ఆర్థిక సంవత్సరం 2023-24లో భారత్‌ 48 దేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంది. 2024-25లో బంగారం దిగుమతులు 27.3 శాతం పెరిగి 58 బిలియన్‌ అమెరికా డాలర్లకు చేరుకున్నాయి.