Gold: భారీగా లాభాలు.. బంగారంలో ఎలా పెట్టుబడులు పెట్టాలి? పూర్తి వివరాలు..

బంగారంపై పెట్టుబడి వల్ల లాభాలు.. నష్టాలు ఏంటంటే?

Gold: భారీగా లాభాలు.. బంగారంలో ఎలా పెట్టుబడులు పెట్టాలి? పూర్తి వివరాలు..

Updated On : March 14, 2025 / 6:39 PM IST

పెట్టుబడిదారులకు బంగారం 2024లో, అలాగే, 2025 మొదటి రెండు నెలల్లో లాభాలు తెచ్చిపెట్టింది. డిమాండ్ భారీగా ఉండడంతో బంగారం ధర గరిష్ఠ స్థాయులను అధిగమిస్తూ, గత 12 నెలల్లో 40% కంటే ఎక్కువగా పెరిగింది.

‘ప్రధానంగా మార్కెట్‌ గురించి పెట్టుబడిదారులు చేస్తున్న ఆలోచనల తీరువల్ల బంగారం ధరలో పెరుగుదల కనపడుతోంది’ అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ జాన్ రీడ్ పేర్కొన్నారు. అలాగే, పాశ్చాత్య పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా బంగారంలో పెట్టుబడులు పెంచారని చెప్పారు.

బంగారం డిమాండ్ 2024లో రికార్డు స్థాయికి చేరుకుందని తెలిపారు. 2024 నాలుగో త్రైమాసికంలో బంగారం డిమాండ్ 1% పెరిగి, వార్షికంగా 4,974 టన్నుల రికార్డు స్థాయిని చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ జువాన్ కార్లోస్ ఆర్టిగాస్ చెప్పారు.

ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఇలాంటి సమయాల్లో స్టాక్ మార్కెట్లు, కరెన్సీల విలువ తగ్గే అవకాశం ఉండటంతో, బంగారం విలువ పెరుగుతుంది. కొన్ని దేశాలు తమ రిజర్వులను పెంచుకోవడానికి డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో బంగారం డిమాండ్‌ పెరిగి తద్వారా ధరలు పెరుగుతున్నాయి.

బంగారంపై పెట్టుబడి ప్రాచీన కాలం నుండి కొనసాగుతోంది. అయితే, నేడు బంగారం కొనుగోలుకు ఎలాంటి మార్గాలు అందుబాటులో ఉన్నాయి? అలాగే, వాటి వల్ల లాభాలు, నష్టాల గురించి వివరంగా తెలుసుకుందాం..

ఫిజికల్ బంగారం కొనడం
ప్రధానంగా బంగారం బార్లు లేదా నాణేలు కొనుగోలు చేయొచ్చు. భౌతిక బంగారం కొనుగోలు చేస్తుంటే మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో కొనుగోళ్ల విషయానికి వస్తే మంచి నాణ్యత ఉన్న బంగారాన్ని కొనడం కోసం లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులైన డీలర్లను మాత్రమే ఎంచుకోవడం మంచిది.

బంగారం మార్కెట్‌లో కొనుగోలు ధర, అలాగే అమ్మకం ధర మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది లావాదేవీల లాభనష్టాలను ప్రభావితం చేస్తుంది. భౌతిక బంగారంపై స్టాంప్ డ్యూటీ లేదా వ్యాట్ లాంటి పన్నులు ఉండవు. భద్రత దృష్ట్యా బంగారాన్ని సురక్షిత ప్రదేశంలో నిల్వ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే చోరీకి గురికావడానికి అవకాశం ఉంటుంది. స్థిరమైన పెట్టుబడిగా భౌతిక బంగారానికి డిమాండ్ ఉంది. అయినప్పటికీ, దాని భద్రత, నిల్వ ఖర్చులు, మదింపు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడి
సింపుల్‌గా, అదే విధంగా తక్కువ ఖర్చుతో బంగారంలో పెట్టుబడి పెట్టే మార్గం ఏదైనా ఉందంటే అది గోల్డ్ ETFs లేదాETCs ద్వారా పెట్టుబడి పెట్టడం. ఇవి నేరుగా బంగారం ధరను ఫాలో అవుతాయి. అయితే, ETFలు భౌతికంగా బంగారం కాదు. కానీ మార్కెట్లో బంగారం ధర మార్పులను ప్రతిబింబిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన ETFలు పెట్టుబడిదారులకు తమ షేర్లను బంగారు నాణేలు లేదా బార్లుగా మార్పిడి చేసుకునే అవకాశాన్ని ఇస్తాయి. అయితే, ETFల ద్వారా పెట్టుబడి పెట్టినప్పుడు నిర్వహణ ఫీజులు, ప్లాట్‌ఫాం ఛార్జీలు వంటి ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

బంగారం మైనింగ్ స్టాక్స్‌లో పెట్టుబడి
పెట్టుబడుల విషయంలో నేరుగా బంగారాన్ని కొనుగోలు చేయకుండా బంగారం మైనింగ్ చేసే కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టడం వంటిది మరో ఆప్షన్. అయితే, బంగారం మైనింగ్ కంపెనీల వ్యాపార వ్యూహాలు, నిర్వహణ సామర్థ్యాలు, వ్యయ నియంత్రణ వంటి అంశాలను సమగ్రంగా విశ్లేషించుకోవాలి. చిన్న మైనింగ్ కంపెనీల్లో పెట్టుబడులు ఎక్కువ రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. కానీ అవి అధిక లాభాలను అందించే సామర్థ్యం కూడా కలిగి ఉంటాయి. అయితే, బంగారం ధర పెరిగితే తప్పక బంగారం మైనింగ్ కంపెనీల షేర్లు పెరుగుతాయని భావించడం సరైనది కాదు. ఎందుకంటే వాటి విలువ అనేక ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

బంగారంపై పెట్టుబడి వల్ల లాభాలు.. నష్టాలు ఏంటంటే?
బంగారం పెట్టుబడిపై చాలా మంది పెట్టుబడిదారులకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఇది ఒక సురక్షిత ఆస్తి. ఇతర పెట్టుబడులలా ఇది ఆర్థిక వ్యవస్థ మార్పులకు అంతగా ప్రభావితం కాదు. కాబట్టి డైవర్సిఫికేషన్ కోసం బంగారం పెట్టుబడి ఒక మంచి ఆప్షన్. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం విలువ పెరిగే అవకాశం ఉంటుంది, అలాగే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

అయితే, ఫిజికల్ బంగారం కొనుగోలు చేసినప్పుడు దానిని భద్రపరచడానికి నిల్వ, బీమా ఖర్చులు అధికంగా ఉండొచ్చు. బంగారం ETFలు డివిడెండ్లు ఇవ్వవు. కాబట్టి నిరంతర ఆదాయాన్ని ఆశించే పెట్టుబడిదారులకు ఇవి సరిపోకపోవచ్చు. అంతేకాదు, బంగారం ధరలో తాత్కాలికంగా ఊహించని హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉన్నందున దీని పెట్టుబడి ప్రమాదాలను అంచనా వేసుకోవడం చాలా అవసరం.

ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యం బంగారం ధరపై ప్రభావం చూపుతుంది. వడ్డీ రేట్లు తగ్గుతున్న సమయంలో బంగారంలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టాలా? వద్దా? అనేది మీ పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్, ఓపిక, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.