సంక్షోభంలో చిక్కుకున్న ప్రయివేటు రంగ సంస్థ యస్ బ్యాంక్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఈ బ్యాంక్ ఖాతాదారులు తమ డిపాజిట్ల నుంచి రూ.50,000 మించి నగదు ఉపసంహరించుకోవడానికి వీలు లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకంటే ఎక్కువ ఉపసంహరించుకోవాలంటే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఈ తాత్కాలిక నిషేధం మార్చి,5 సాయంత్రం గం.6ల నుండి 2020 ఏప్రిల్ 3 వరకు వర్తిస్తుంది.
ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. డిపాజిట్లు, రుణాలు, సేవింగ్, కరెంట్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలు రూ.50వేలు మించడానికి వీలు లేదు. అయితే డిపాజిట్‌దారులకు లేదా వారిపై ఆధారపడిన వారికి వైద్యం, ఉన్నత విద్యా, పెళ్లిళ్లు, ఇతర ఏదైనా అత్యవసరం అయితే ఆర్‌బిఐ అనుమతితో అదనంగా నగదు తీసుకోవడానికి వీలు కల్పించింది. వచ్చే నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ 3వ తేది వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. కాగా యస్ బ్యాంకు గత కొన్ని నెలలుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కొనసాగుతుంది.
డిసెంబర్ త్రైమాసికంతో ముగిసిన ఆర్ధిక ఫలితాలను ఇప్పటికీ విడుదల చేయలేదు. తీవ్ర మొండి బాకీలను ఎదుర్కొంటుంది. గత కొన్ని నెలలుగా మూలధనం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. బ్యాంక్ పరిస్థితి బాగోలేనందున ఏ ఇన్వెస్టర్ కూడా పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. తాజా పరిణామం ఆ బ్యాంక్‌లోని సంక్షోభాన్ని తేటాతెల్లం చేసినట్లయ్యింది.
తీవ్ర మూలధన కొరత ఒత్తిడిలో చిక్కుకున్న యస్ బ్యాంకుకు ఇప్పుడు బెయిలవుట్ ఇవ్వడానికి పలు ప్రభుత్వ రంగ సంస్థలపై మోడీ సర్కార్ ఒత్తిడి తెస్తోందని సమాచారం. యస్ బ్యాంకును గట్టెక్కించడానికి ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లను కేంద్రం రంగంలోకి దింపిందని రిపోర్టులు వస్తోన్నాయి. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి యస్ బ్యాంకుకు మూలధనం అందించనున్నాయని సమాచారం. యస్ బ్యాంకుకు రూ.12,000 నుంచి రూ.14,000 కోట్ల మేర నిధులు అందించడానికి ఆర్ధిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బిఐ వద్దకు ప్రతిపాదనలు చేరినట్లు సమాచారం. ఈ మూలధనాన్ని ఈక్విటీలు, కన్వర్టేబుల్ డిబెంచర్ల ద్వారా సమకూర్చే అవకాశం ఉంది. దీనికి ఎస్‌బిఐ కన్సోరియం (నాయకత్వం) వహించనుంది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్ ఓ కథనం వెల్లడించింది.