Zomato CEO Deepinder Goyal, wife turn delivery agents for a day, internet reacts
Zomato CEO : ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్‌గా మారారు. తన సతీమణితో కలిసి జొమాటో యూనిఫాంలో ఆయన ఫుడ్ డెలివరీ చేశారు. జొమాటో ఫుడ్ డెలివరీ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలానే ఈసారి కూడా జొమాటో బాస్ తన సతీమణితో ఫుడ్ డెలివరీ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
తాజాగా దీపిందర్, ఆయన భార్య గ్రేసియా మునోజ్ అలియాస్ గియా గోయల్‌తో గురుగ్రామ్‌లో జొమాటో ఫుడ్ డెలివరీని పూర్తి చేశారు. జొమాటో సర్వీసు గురించి వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఇలా ఫుడ్ డెలివరీ చేసినట్టుగా ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ మేరకు దీపిందర్ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
డెలివరీ బాయ్‌గా తన అనుభవాన్ని కూడా తెలియజేశారు. గత 2 రోజుల క్రితమే జొమాటో ఆర్డర్‌లను డెలివరీ చేసినట్టుగా చెప్పారు. భార్య గ్రేసియాతో డెలివరీ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో కస్టమర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. అలాగే, కస్టమర్లకు డెలివరీ చేయడమంటే తాను చాలా ఇష్టమన్నారు. భార్యతో రైడ్ ఎంతో ఆనందంగా ఉందని క్యాప్షన్ కూడా ఇచ్చారు.
ఇప్పటివరకూ ఆ ఫొటోలకు 28వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. రీల్‌కు దాదాపు 12వేలకు లైక్‌లు ఉన్నాయి. దీపిందర్, సతీమణి గ్రేసియా కలిసి డెలివరీ చేయడంపై పలువురు ప్రశంసిస్తుంటే మరికొందరు నెటిజన్లు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఒక్క గురుగ్రామ్‌లోనే కాదు.. సిటీ బయట కూడా ఇలానే ఫుడ్ డెలివరీ చేయాలంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు.
మరో యూజర్ “బ్రో సైబర్ సిటీ ప్రాంతాలకు కాకుండా పాత గురుగ్రామ్ ప్రాంతానికి కూడా డెలివరీ చేయండి” అని పేర్కొన్నాడు. “సోదరా, మీరు మళ్ళీ రాంగ్ టర్న్ తీసుకున్నారు.. ముందుకు ఎడమవైపు తిరగండి.. నేను అక్కడే నిలబడి ఉన్నాను.”అని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇది కేవలం “పబ్లిసిటీ స్టంట్” అని కొందరు గోయల్‌ను విమర్శించారు.