కరోనా వైరస్ మనుషుల్లో ప్రాణభీతిని పెంచింది. భగవంతుడా నాకేమి కాకుండా చూడు అని ప్రార్ధించే వాళ్లు ఎక్కువయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే భగవంతడిని వేడుకుంటున్నారు ప్రజలు. కరోనా వైరస్ బారినుంచి కాపాడమని పూజలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న ఒక మహిళపై దాడి జరిగింది. గుజరాత్ లోని గాంధీనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
భర్త మరణించిన 45 ఏళ్ళ మహిళ గాంధీనగర్ లోని ఓకాలనీలో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఇటీవల ఆ మహిళకు తనకు కరోనా మహమ్మారి సోకుతుందేమోనని భయం పట్టుకుంది. ఆ భయంతో ఆమె రోజు అమ్మవారికి పూజలు చేయటం ప్రారంభించింది. పూజలు చేసే క్రమంలో బిగ్గరగా మంత్రాలు చదువుతూ , స్తోత్రాలు చదవటం వలన ఇరుగు పొరుగు వారికి ఆమె వలన ఇబ్బంది కలుగుతోంది.
దీంతో వారు అందుకు అభ్యంతరం చెప్పారు. అయినా ప్రాణ భయంతో ఉన్న ఆ మహిళ తన పూజలు మానలేదు. జులై 12 సాయంత్రం వేళలో ఇంటి వద్ద దీపాలు వెలిగించి ఆమె పూజ చేసుకుంటున్నప్పుడు పక్కన ఇంటిలో నివసించే వనాజీ ఠాకూర్, (50) అతని కుమారుడు సిధ్దరాజ్ ఇరువురు ఆమె పూజలకు అభ్యంతరం చెప్పారు.
ఆమెను పూజ చేసుకోనివ్వకుండా ఆమెను వేధించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోంది. వారు అభ్యంతరం చెప్పినా ఆమె తన పూజ ఆపక పోవటంతో వారు ఇటుకతో ఆమె తలపై కొట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి కొడుకులను అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 324,506 ,294 కింద అభియోగాలు మోపారు.