married women missing with children : హైదరాబాద్ కూకట్ పల్లిలో ఒక వివాహిత మహిళ తన ఇద్దరు పిల్లలతో ఆదృశ్యం అయ్యింది. కూకట్ పల్లి రాజీవ్ గాంధీ నగర్ లో నివసించే మానస తన ఇద్దరు పిల్లలు తేజ(9) ,యశ్విక(8) లతో కలిసి పుట్టింటికి వెళుతున్నానని చెప్పి మంగళవారం బయలుదేరి వెళ్లింది. కానీ ఆమె పుట్టింటికి చేరలేదు.
ఆమె పుట్టింటికి చేరకపోవటం…. ఫోన్ చేస్తే… స్విచ్చాఫ్ చేసినట్లు రావటంతో ఆందోళన చెందిన భర్త పరమేష్ కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మానస ఇంటి నుంచి బయటకు వెళ్లిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మూడు రోజులైనా ముగ్గురి ఆచూకి లభించకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కాగా… తెలంగాణలో రోజు రోజుకు మిస్సింగ్ కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 203 మంది ఆదృశ్యమయ్యారు. ఈనెల 26న 65 మంది, 27న 62 మంది, 28వ తేదీన 65 మంది మిస్సింగ్ అయినట్లుగా తెలుస్తోంది. గత 8 నెలలుగా 1282 మిస్సింగ్ కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.