4 of family killed in Chhattisgarh, : చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేశారు. దుర్గ్ జిల్లాలోని అమలేశ్వర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖుద్‌ముద గ్రామంలో బాలరాజ్ సోంకర్(60), దులారిన్ భాయ్(55) దంపతులకు కుమారుడు రోహిత్(30), కోడలు కిర్తిన్, పదకొండు సంవత్సరాల మనువడు ఉన్నాడు. వీరంతా ఒకే ఇంట్లో నివాసిస్తున్నారు. సోంకర్ కుటుంబం మొత్తం వ్యవసాయం చేసుకుంటూ జీవనంసాగిస్తోంది.
ఊరికి సమీపంలోని పొలంలోనే గుడిసె వేసుకుని అక్కడే ఉంటున్నారు. అయితే సోమవారం ఉదయం అత్త దులారిన్ , కోడలు కీర్తిన్ గుడిసెలో హత్యకు గురై ఉండటం. 11 సంవత్సరాల పిల్లవాడు తీవ్ర గాయాలతో ఉండటం చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు జాగిలాల సాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నించగా… పొలం లోని వ్యవసాయ బావి వద్ద మామ సోంకర్, కొడుకు రోహిత్ మృతదేహాలను కనుగొన్నారు. అప్రమత్తమైన స్థానికులు ఆ బాలుడిని చికిత్స కోసం రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. కానీ అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
పోలీసులు నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోంకర్ కుటుంబం హత్యకు గల కారణాలపై పోలీసులు దృష్టి సారించారు. సోంకర్ కుటుంబానికి ఎవరితో శత్రుత్వం లేదని స్థానికులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు బృందాలు ఏర్పాటే చేసినట్లు చత్తీస్ ఘడ్ డీజీపీ డీఎం అవస్థీ తెలిపారు.