ఒక కారు ప్రమాదం.. 5 అనుమానాలు : మిస్టరీగా మారిన ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతి

ఒక్క కారు ప్రమాదం. ఎన్నో అనుమానాలు. సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే బంధువులు 20 రోజులుగా కనిపించకపోయినా.. ఎక్కడా అలజడి లేదు. సడెన్‌గా కాలువలో శవాలై తేలిన తర్వాత

  • Publish Date - February 18, 2020 / 04:02 AM IST

ఒక్క కారు ప్రమాదం. ఎన్నో అనుమానాలు. సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే బంధువులు 20 రోజులుగా కనిపించకపోయినా.. ఎక్కడా అలజడి లేదు. సడెన్‌గా కాలువలో శవాలై తేలిన తర్వాత

ఒక్క కారు ప్రమాదం. ఎన్నో అనుమానాలు. సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే బంధువులు 20 రోజులుగా కనిపించకపోయినా.. ఎక్కడా అలజడి లేదు. సడెన్‌గా కాలువలో శవాలై తేలిన తర్వాత విషయం బయటికొచ్చింది. ఇంతకీ, కాకతీయ కెనాల్ కారు ప్రమాదం వెనక ఏం జరిగింది. నిజంగా ప్రమాదమేనా, యాక్సిడెంట్‌లా కనిపించేట్టు అల్లిన కథా.

20 రోజుల తర్వాత బయటపడిన కారు:
ఆదివారం(ఫిబ్రవరి 16,2020) రాత్రి దంపతులు బైక్‌పై వెళ్తున్నారు. సడెన్‌గా కళ్లలో పురుగు పడడంతో దంపతులు బైక్‌తో సహా కాకతీయ కాలువలో పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నంలో ఒక్కరినే కాపాడగలిగారు. భార్య చనిపోయింది. అదే సమయంలో బైక్‌ కోసం వెతుకుతున్న వారు నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అధికారులకు సమాచారం ఇచ్చి లోయర్ మానేరు నుంచి నీటి విడుదలను ఆపేశారు. నీటి మట్టం తగ్గడంతో అనూహ్యంగా కాకతీయ కాలువలో మునిగిపోయిన కారు బయటపడింది. కారును వెలికితీసిన స్థానికులు షాక్‌ అయ్యారు. కారులో నుంచి మూడు మృతదేహాలు బయటపడ్డాయి. ఫిబ్రవరి 17వ తేదీన కారు బయటపడింది.

మృతులు ఎమ్మెల్యే బంధువులు:
కారు నెంబర్‌ ఆధారంగా పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి చెల్లి, బావ, వాళ్ల కూతురు అని గుర్తించారు. కారులో వెనుక సీట్లో సత్యనారాయణ రెడ్డి, ఆయన భార్య రాధిక, కూతురు వినయశ్రీ మృతదేహాలను బయటికి తీశారు. వారి డెడ్‌ బాడీస్‌ చూస్తే నిన్న మొన్న నీళ్లల్లో పడ్డట్టు లేదు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయ్ ఆ బాడీస్‌. కారులో మూడు మృతదేహాలు ఉండడం, స్వయానా ఎమ్మెల్యే బంధువులు అవడంతో అటెన్షన్‌ పెరిగింది. ఆరా తీస్తే సుమారు 20 రోజుల క్రితమే(జనవరి 27,2020) ఈ ప్రమాదం జరిగిందని తేలింది. ఈ పాయింట్‌ నుంచే ఎన్నో అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఊరు వెళ్లేందుకని తనతో కారులో బట్టలు పెట్టించారని చెబుతున్నాడు సత్యనారాయణ రెడ్డి గుమస్తా నర్సింగ్. ఆ తర్వాత వారి ఆచూకీ తెలియకుండా పోయిందన్నాడు.

నిజంగా ప్రమాదమేనా?
జనవరి 27 మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మొబైల్ స్విఛ్ఛాప్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబం ఏమైందో, ఎక్కడికి వెళ్లిందో ఆరా తీసిన వారే లేరు. ఇంట్లోంచి బయల్దేరిన వాళ్లు గమ్యానికి చేరుకోలేదు. అలాగని ఇంటికీ రాలేదు. అయినా సరే ఎవరూ పట్టించుకోలేదు. అలా అదృశ్యమై విగతజీవులుగా అదీ ఓ కాలువలో బయటపడటంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఇది ప్రమాదమేనా, ప్రమాదంలా సృష్టిస్తున్నారా అనే డౌట్స్ పుట్టుకొచ్చాయి.

డ్రైవర్ సీటులో ఎవరూ లేరు:
* కారులో ఉండిపోయిన ముగ్గురి మృతదేహాలూ వెనక సీట్లోనే ఉన్నాయి. 
* డ్రైవర్ సీట్లో ఎవరూ లేరు. అదెలా సాధ్యం అనేది మొదటి అనుమానం. 
* రాత్రి పూట బైక్‌ పడిపోతేనే స్థానికులు గమనించి రక్షించే ప్రయత్నం చేశారు. అలాంటిది కారు ప్రమాదాన్ని గుర్తించలేదా అన్నది రెండో అనుమానం. 
* పైగా కుటుంబంలోని ముగ్గురూ 20 రోజులుగా కనిపించకుండా పోయినా ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది మూడో అనుమానం. 
* జనవరి 29న సత్యనారాయణ రెడ్డి ఇంటి తాళాలు పగలగొట్టి వెతికారని చెప్తున్నారు. తాళం పగలగొట్టి దేనికోసం వెతికారన్నది నాలుగో అనుమానం. 
* వారం క్రితం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో సత్యనారాయణ రెడ్డి నెంబర్ టవర్ లోకేషన్ తెలుసుకోవాలని ఓ వ్యక్తి పోలీసులను అడిగాడు. కంప్లైంట్‌ ఇవ్వండి వెతికిపెడతాం అన్నారు పోలీసులు. అంతే.. అడిగొస్తానని చెప్పి వెళ్లిపోయిన వ్యక్తి మళ్లీ రాలేదు. ఇది ఐదో అనుమానం. 

నాకేమీ తెలీదు.. ఎమ్మెల్యే మనోహర్:
తన సోదరి, బావ మృతి చెందడం.. తమ కుటుంబానికి తీరని లోటన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి. గత నెలలో వారంతా బయటకు వెళ్లారని చెప్పారు. తన బావ వ్యాపారం చేసుకుంటాడని, చెల్లెలు టీచర్‌ అని చెప్పారు. ఆర్ధికంగా వారికి ఎలాంటి సమస్యా లేదని.. అసలు ఎలా జరిగిందో తెలియదన్నారు. మొత్తానికి ఒక ప్రమాదం ఎన్నో అనుమానాలకు కారణమైంది. ఇది నిజంగా ప్రమాదమేనా, లేదా ప్రమాదంగా సృష్టిస్తున్నారా అన్నది మున్ముందు తెలుస్తుంది.