ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. మహిళా పోలీసులతో అరెస్ట్ చేయించిన సిట్
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు పోలీసులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

All Women Police Team Arrested MP Prajwal Revanna
Women Police Arrested Prajwal Revanna: ఎంతో మంది మహిళల జీవితాలతో ఆడుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆయనను అరెస్ట్ చేశారు. ఎంపీ ప్రజ్వల్ అరెస్ట్ సందర్భంగా ట్విస్ట్ చోటుచేసుకుంది. అందరూ మహిళా పోలీసులే ఉన్న ప్రత్యేక బృందం ఆయనను అరెస్ట్ చేయడం విశేషం. అర్ధరాత్రి తర్వాత జర్మనీ నుంచి తిరిగి వచ్చిన ఎంపీని ముగ్గురు మహిళా పోలీసు అధికారులు బెంగళూరు విమానాశ్రయం నుంచి తీసుకెళ్లారు.
గట్టి సందేశం ఇచ్చారు..
అరెస్టు వివరాలను మాజీ పోలీసు అధికారి, రాజకీయ నాయకుడు భాస్కర్ రావు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని లేడీ పోలీసులతో అరెస్ట్ చేయించి గట్టి సందేశం పంపించారని SIT చీఫ్‌ను ఆయన ప్రశంసించారు. ”పరారీలో ఉన్న ఎంపీని పట్టుకుని బెంగుళూరు విమానాశ్రయం నుంచి మహిళా పోలీసు బృందం బయటకు తీసుకువెళ్లింది. సిట్ నిర్ణయం.. కర్ణాటకలోని మహిళా పోలీసులు నేరస్థుడిని ఎదుర్కొగలరనే బలమైన సానుకూల సంకేతాన్నిచ్చింది. అంతేకాదు తమకు అవమానం జరిగిన వందలాది మంది మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చేలా విశ్వాసాన్ని కల్పించింది. SIT చీఫ్ మంచిపని చేశార”ని భాస్కర్ రావు ఎక్స్‌లో పేర్కొన్నారు.
చేతికి సంకెళ్లు వేయాల్సింది..
లేడీ పోలీసులతో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయించడంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మంచి పని చేశారని మెచ్చుకుంటున్నారు. అతడి చేతికి సంకెళ్లు వేసి ఉండాల్సిందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. కొంత మంది నెటిజనులు మాత్రం భిన్నంగా స్పందించారు. హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన రేవణ్ణ ఎంపీగా గెలిస్తే.. పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నేరస్థుడికి శిక్ష పడేలా చేస్తేనే పోలీసుల సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. రేవణ్ణను మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు.. కోర్టులో మహిళా న్యాయమూర్తే కేసు విచారిస్తారా? ఎందుకంటే నిందితుడికి బలమైన మహిళ (అతని తల్లి) మద్దతు కూడా ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Also Read: తీహార్ జైలులో లొంగిపోతున్నా.. తల్లిదండ్రులు, భార్య గురించి కీలక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్
రేవణ్ణ తల్లికి సిట్ నోటీసులు
జూన్ 1 విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీని సిట్ ఆదేశించింది. 41(ఎ) సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భవానీని ఆమె నివాసంలోనే విచారిస్తామని నోటీసుల్లో సిట్ పేర్కొంది.
Also Read: ఎన్నికల ఫలితాలను తేల్చే ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఇంత ఉత్కంఠ ఎందుకు నెలకొందో తెలుసా?
పోలీసు కస్టడీకి ప్రజ్వల్ రేవణ్ణ
జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు జూన్ 6 వరకు పోలీసు కస్టడీ విధించింది. 15 రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరగా.. న్యాయస్థానం 6 రోజులు పోలీసు కస్టడీకి పంపింది. ఎంపీ తరఫు న్యాయవాదులు రోజూ ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య ఆయనను కలిసేందుకు అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.