Raidurgam Police: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ ఆస్తి పంచాయితీ రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు చేరింది. తమపై కాల్పులు జరిపినట్లు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా కేఈ ప్రభాకర్ కు, ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ కు మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. తన అల్లుడు అభిషేక్ గౌడ్ గన్ తో బెదిరించాడని గతంలో కేఈ ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 25న రాయదుర్గం పీఎస్ లో అల్లుడు అభిషేక్ గౌడ్ పై కేసు నమోదైంది. తాజాగా కేఈ ప్రభాకర్ కాల్పులు జరిపినట్లు అభిషేక్ గౌడ్ అనుచరులు రాయదుర్గం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులపై దర్యాఫ్తు చేస్తున్నామన్నారు పోలీసులు.
ఇద్దరు రాజకీయ నాయకులు ఇంటి పంచాయితీ రాయదుర్గం పీఎస్ కు చేరింది. గడిచిన కొద్ది రోజులుగా రాయదుర్గం పీఎస్ పరిధిలోని పంచవటి కాలనీలో కేఈ ప్రభాకర్, ఆయన అల్లుడికి సంబంధించి ఒక ల్యాండ్ వివాదం నడుస్తోంది. గడిచిన నెలలో ఈ వివాదానికి సంబంధించి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. తాజాగా ఇదే విషయంపై మాట్లాడుకునే క్రమంలో కేఈ ప్రభాకర్ తనపై గన్ తో కాల్పులు జరిపినట్లుగా అల్లుడు అభిషేక్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేఈ ప్రభాకర్, అతడి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరించినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. 2 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీకి సంబంధించి వివాదం నెలకొంది.
ఈ గొడవకు సంబంధించి రాయదుర్గం పోలీసులు వివరాలు తెలిపారు. ”ఏపీకి చెందిన రాజకీయ నాయకుడి కుమార్తెతో, తెలంగాణకు చెందిన పొలిటికల్ లీడర్ కుమారుడికి 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాల వల్ల దంపతులు విడిపోయారు. గత సంవత్సర కాలంగా వేరుగా
ఉంటున్నారు. మణికొండ పంచవటి కాలనీలో వాళ్లకు సంబంధించిన ఒక ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య గత నెల 25న గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధించి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ లో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. రెండు వర్గాల నుండి ఫిర్యాదు తీసుకున్నాము. దర్యాప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. గన్ ఫైరింగ్ కి సంబంధించి మా దృష్టికి రాలేదు. దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా మా దృష్టికి రాలేదు. కాల్పులకు సంబంధించి ఏమైనా ఆధారం ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.”
కాగా, కేఈ ప్రభాకర్ తన అల్లుడు అభిషేక్ గౌడ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గన్ పెట్టి బెదిరించాడని కంప్లైంట్ ఇచ్చారు. ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ పై అక్టోబర్ 25న రాయదుర్గం పీఎస్ లో కేసు నమోదైంది. అభిషేక్ గౌడ్ పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందేశ్వర్ గౌడ్ కుమారుడు.