ఆయేషా మీరా హత్య కేసు:  సత్యంబాబును విచారిస్తున్న సీబీఐ

హై కోర్టు ఆదేశాల మేరకు ఆయేషా మీరా మర్డర్ కేసును సీబీఐ అధికారులు తిరిగి విచారిస్తున్నారు.

  • Publish Date - January 18, 2019 / 05:09 AM IST

హై కోర్టు ఆదేశాల మేరకు ఆయేషా మీరా మర్డర్ కేసును సీబీఐ అధికారులు తిరిగి విచారిస్తున్నారు.

విజయవాడ: ఏపీలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్ధిని ఆయేషామీరా హత్య కేసులో శుక్రవారం ఉదయం నుంచి సత్యంబాబును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఇబ్రహీం పట్నంలోని శ్రీదుర్గా హాస్టల్ నిర్వాహకులను సీబీఐ అధికారుల విచారించనున్నారు.  
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గ లేడీస్ హాస్టల్‌లో 2007 డిసెంబర్ 27 న బి ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్యకు గురైంది. ఈ కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. కేసును విచారించిన పోలీసులు.. సత్యంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతనే ప్రధాన నిందితుడని చెప్పారు. కాగా న్యాయవిచారణా అనంతరం 31 మార్చి 2017న హైదరాబాదు హై కోర్టు సత్యం బాబును నిర్దోషిగా ప్రకటించింది.
అయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషిగా బయటపడ్డాక.. అసలు దోషి ఎవరనే ప్రశ్న తలెత్తింది. సత్యంబాబుపై తాము ఎప్పుడు అనుమానాలు వ్యక్తంచేయలేదని.. పోలీసులే కేసును తప్పుదోవ పట్టించారని అయేషా తల్లిదండ్రులు సైతం స్పష్టంచేశారు. 
కాగా….2018 నవంబర్ 29 న కేసు కొత్త మలుపు తిరిగింది. ఆయేషా మీరా హత్య కేసును మళ్లీ విచారణ చేయాలంటూ సీబీఐకి హైకోర్టు ఆదేశించింది. విజయవాడ కోర్టు కస్టడీలో ఉన్న ఆయేషా మీరా కేసు ఆధారాలను నాశనం చేశారంటూ ఆయేషా మీరా తల్లి హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. కేసును మొదటి నుంచి విచారణ చేయాలని, కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేయాలని కోర్టు సీబీఐ నిఆదేశించింది. అందులో భాగంగా సీబీఐ శుక్రవారం సత్యంబాబును విచారిస్తోంది.