Khazana Jewellery Robbery Case: ఖజానా జువెలరీ చోరీ కేసు.. ముగ్గురు నిందితులు అరెస్ట్.. నెల రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చి..

నెల రోజుల నుంచి ఖజానా జువెలరీలో చోరీకి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.

Chandanagar jewellry case

Khazana Jewellery Robbery Case: హైదరాబాద్ చందానగర్ లోని ఖజానా జువెలర్స్ లో చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. బీదర్ లో ఇద్దరిని, పుణెలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నెల రోజుల క్రితం బీహార్ నుంచి నగరానికి వచ్చినట్లు గుర్తించారు. స్థానికులకు అనుమానం రాకుండా ఉండేందుకు జగద్గరిగుట్టలోని ఓ గ్లాస్ పరిశ్రమలో పని చేస్తున్నారు. నెల రోజుల నుంచి ఖజానా జువెలరీలో చోరీకి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

అసలేం జరిగింది?
ఖజానా జువెలరీలో భారీ చోరీ జరిగింది. ఆరుగురు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఓ దొంగ జరిపిన కాల్పుల్లో ఒకరికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. 10 ప్రత్యేక బృందాలతో దొంగల కోసం గాలిస్తున్నారు. ఖజానా జువెలర్స్ లో ఉన్న సిబ్బందిని గన్ తో బెదిరించి లాకర్ తాళాలు ఇవ్వాల్సిందిగా దుండగులు అడిగారు. సిబ్బంది లాకర్ కీ ఇవ్వకపోవడంతో గన్ తో వారిని బెదిరించారు.

అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపిన ముఠా లోపలికి వెళ్లి బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలకొట్టారు. సిబ్బంది భయంతో వణికిపోయారు. ఆ వెంటనే తేరుకుని పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసుల రాకను గమనించి ఆరుగురు సభ్యుల దొంగల గ్యాంగ్ పారిపోయింది. ముఖానికి మాస్కులు ధరించిన ఆరుగురు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డారు.