హ్యాట్సాఫ్ తెలంగాణ పోలీస్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

  • Publish Date - December 6, 2019 / 08:28 AM IST

దిశ హత్యాచార ఘటన నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లోనూ ఈ ఘటనపై చర్చ జరిగింది. నిందితులను ఎన్ కౌంటర్ చేయటం శుభ పరిణామమని హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

దేశంలో మహిళలపై హత్యాచార ఘటనలకు పాల్పడిన వారిని ఈవిధంగానే శిక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులను చాలామంది తిట్టారని అందులో తానూ ఒకడిని అని..నిందితులను ఎన్ కౌంటర్ చేసినందుకు పోలీసులకు హ్యాట్సాఫ్ అన్నారు.

తెలంగాణ పోలీసులను చూసి ప్రతి రాష్ట్రంలోనూ పోలీసులు ఈవిధంగా చేస్తే మహిళలపై దౌర్జన్యాలను నివారించవచ్చని రాజాసింగ్ అన్నారు. ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విచారణ చెయ్యాలంటున్నారు..కానీ ఏ విచారణ అవసరం లేదని రాజాసింగ్ అన్నారు. తెలంగాణ పోలీసులు ఎవరికీ భయపడనవసరం లేదనిభారతదేశం యావత్తు మీ వెంట ఉందని ఆయన భరోసా ఇచ్చారు.