Brothers Attack On Rlatives
Murder Attack : పెళ్లి పత్రికలో పేర్లు వేయలేదని జరిగిన ఘర్షణలో నలుగురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. సికింద్రబాద్,తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
మూడు రోజులక్రితం చంద్రశేఖర్ నగర్‌లో నివసించే సురేష్ అనే వ్యక్తి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి పత్రికలో తమ పేర్లు ఎందుకు వేయలేదని.. వారి బంధువు సర్వేష్ పెళ్లిరోజు సురేష్ కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు.
ఈగోడవలో సురేష్ సోదరి బాలామణిని కూడా దూషించాడు. మిగతా బంధువులందరూ వచ్చి సర్వేష్‌కు నచ్చచెప్పి గొడవ సర్దుమణిగేలా చేశారు. ఈ విషయంపై మాట్లాడదామని ఆదివారం ఉదయం తమ కుంటుంబ సభ్యులను, పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకుని బాలామణి సర్వేష్ ఇంటికి వెళ్ళింది.
దీంతో సర్వేష్, అతని సోదరుడు శేఖర్ ఇంటికి వచ్చిన వారిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈదాడిలో వారి బంధువులు ఎస్ ప్రవీణ్(30), నోముల పరశురాము(35), డి యాదగిరి (42), ఎన్ ప్రతాప్ కుమార్ (32)లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన నిందితులిద్దరూ పరారయ్యారు.
గాయపడిన వారిలో ఎస్ ప్రవీణ్, నోముల పరశురాము పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు తుకారాంగేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.