Thief Arrested : చోరీలు చేసి సొంతింటి కల నిజం చేసుకోవాలనుకున్నాడు…కానీ…

అతనో గజదొంగ.. ఇళ్ళతాళాలు తొలగించి చోరీలు చేయటంలో చేయి తిరిగిన నేర్పరి. 30 ఇళ్లల్లో చోరీలు చేసిన ఈ చోరశిఖామణి తాను ఓ ఇంటివాడు  కావాలనుకున్నాడు.

Burglar Arrest

Thief Arrested : అతనో గజదొంగ.. ఇళ్ళతాళాలు తొలగించి చోరీలు చేయటంలో చేయి తిరిగిన నేర్పరి. 30 ఇళ్లల్లో చోరీలు చేసిన ఈ చోరశిఖామణి తాను ఓ ఇంటివాడు  కావాలనుకున్నాడు. దొంగిలించిన సొమ్ముతో ఇల్లు కొనుక్కోవాలనుకున్న అతని కలలను పోలీసులు కల్లలు చేశారు.

మహారాష్ట్రలోని పూణే జిల్లా పింప్రి చించ్‌వాడ్ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే లఖన్ అశోక్ జెతిథోర్ చోరీలు చేసి జీవనం సాగిస్తున్నాడు.  చోరీ చేసిన సొమ్ముతో ఒక కారు కొనుక్కుని హ్యాపీగా తిరుగుతున్నాడు. ఇంతలో అతనికి సొంతిల్లు కొనుక్కోవాలనే కోరిక పుట్టింది. అందుకు ప్రయత్నాలు చేయసాగాడు.

ఈలోపు జెతిథోర్ చోరీ చేసిన ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అక్కడ లభించిన సీసీటీవీ ఫుటేజి ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర నిందితుడిని గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజి లోని అనుమానితుడితో  సరిపోల్చుకున్నారు. వెంటనే  జెతిథోర్ ను   అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి   780 గ్రాముల బంగారం,  రూ. 77 లక్షల విలువైన  ఇతర వస్తువులను, ఒకఎస్‌యూవీ ని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడి వద్ద  చోరీ సొత్తును కొనుగోలు చేసిన ఇద్దరు జ్యూవెలర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇళ్లలో  చోరీలు చేసిన సొత్తుతో  ప్లాట్  కొనుగోలు చేయాల‌ని నిందితుడు ప్ర‌య‌త్నించాడ‌ని పోలీసులు తెలిపారు.