గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, సినీ హీరో సుధాకర్ కు గాయాలయ్యాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్” సినిమాతో పరిచయమైన సుధాకర్ ప్రయాణిస్తున్న కారు జాతీయ రహాదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, హీరో సుధాకర్ కోమకుల కు గాయాలయ్యాయి.
కాగా హరినాథ్ బాబు దర్శకత్వంలో “నువ్వు తోపు రా” అనే సినిమాలో సుధాకర్ నటించాడు. ఈ సినిమా మే 3న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ లోభాగంగా హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తూండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకొన్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.