అర్ధరాత్రి వేళ చేతిలో రాడ్లు, ఒంటిపై నిక్కర్లు.. ముఖాలకు ముసుగులు ధరించిన ఐదుగురు సభ్యుల ముఠా… కుంట్లూరు, పసుమాముల కాలనీల్లోకి ఎంటరైన విజువల్స్ సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను చూసి బాధితులే కాదు.. స్థానికులందరూ భయాందోళనకు గురవుతున్నారు. సమసిపోయిందనుకున్న చెడ్డీ గ్యాంగ్ సమస్య మళ్లీ మొదలవడంతో కలవరపడుతున్నారు. అయితే… చోరీలు జరిగిన వెంటనే స్పాట్‌కు వెళ్లిన పోలీసులు ఇది చెడ్డీ గ్యాంగ్ పనేనని నిర్ధారించుకున్నారు. వారిని పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాత్రివేళల్లో.. పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ… అవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయంటున్నారు స్థానికులు.
మూడ్రోజుల క్రితం కుంట్లూరు, పసుమాముల ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. వేద పాఠశాలతోపాటు రెండిళ్లలో దోపిడీకి పాల్పడింది. ముందుగా యాగ్నిక వేద పాఠశాలలో దూరిన ఐదుగురు సభ్యుల ముఠా.. అందులోని కిషోర్ స్వామి అనే వ్యక్తిని బెదిరించి కాళ్లు, చేతులు కట్టిపడేసింది. ఆ తర్వాత మిగతా కుటుంబసభ్యులను కూడా బెదిరించి… 11 తులాల బంగారం, 50 వేల నగదు దోచుకొని పారిపోయారు. మరో రెండిళ్లలో చోరీలకు పాల్పడింది చెడ్డీ గ్యాంగ్. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసిన ముఠా ఇంటి తాళాలు పగలగొట్టి బీభత్సం సృష్టించింది.
ఆ ఇంట్లోని… 5 తులాల బంగారం, 45 వేల క్యాష్ ఎత్తుకెళ్లారు. వెళ్తూ.. వెళ్తూ.. ఇంటి పక్కన గుడిసెలో ఉన్న వాచ్‌మెన్‌ని బెదిరించి.. 6 వేలు విలువైన మొబైల్ కూడా లాక్కొని పారిపోయారు. చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోయి మూడ్రోజులవుతున్నా ఇంతవరకు పోలీసులు రాత్రివేళ గస్తీ పెంచలేదని, కనీసం పెట్రోలింగ్ కూడా నిర్వహించడం లేదని నగర శివారు ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రంతా తాము భయంభయంగా బతకాల్సి వస్తోందని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని చెబుతున్నారు. పగలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లాలంటేనే భయంగా ఉందని అంటున్నారు.
Read More : కంగ్రాట్స్ : మేఘా విజయం..మోటార్ల ట్రయల్ రన్ విజయవంతం