Chennai Custody Death
Chennai Custody Death : తమిళనాడులోని చెన్నైలో లాకప్ డెత్‌లో చనిపోయిన విఘ్నేష్ ఒంటిపై 13 చోట్ల గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. విఘ్నేష్ మృతికి కారణాలు ఏంటనేది ఇంకా తేలనప్పటికీ ప్రస్తుతం ఈ రిపోర్టు కలకలం రేపుతోంది. విఘ్నేష్ తల,కళ్లు,గడ్డం,భుజాలపై గాయాలున్నాయని పోస్టుమార్టం నివేదికలో ఉండటంతో పోలీసులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటననకు సంబంధించిన విడుదలైన సీసీటీవీ పుటేజి ఒకటి వివాదాస్పదంగా మారింది.
గంజాయి అమ్ముతున్నాడనే కేసులో ఏప్రిల్ 18న జీ5 సెక్రటేరియట్ కాలనీ పోలీసులు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో పోలీసులు అతడ్ని వెంటపడి పట్టుకుని, కొట్టుకుంటూ తీసుకు వెళ్ళిన సీసీటీవీ ఫుటేజి బయట పడింది. కింద పడిన విఘ్నేష్‌ను పట్టుకునే సమయంలో ఒక కానిస్టేబుల్ లాఠీతో కొడుతున్నట్లు ఆ విజువల్‌లో ఉంది. ఆ సమయంలో పోలీసులు కిందపడిన ఒక వస్తువును తీసుకున్నారని విఘ్నేష్ బంధువులు ఆరోపించగా … అది విఘ్నేష్ పోలీసుల పైకి విసిరిన కత్తి అని పోలీసులు వివరణ ఇచ్చారు.
ఆ మర్నాడు లాకప్‌లో విఘ్నేష్ మరణించాడు. కేసుపై నోరు మెదపకుండా ఉండేందుకు పోలీసులు తమ కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చారని విఘ్నేష్ సోదరుడు వినోద్ విలేకరుల సమావేశంలో ఆరోపించాడు. ఈ ఘటనపై అధికారులు ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక సబ్-ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి, ఈకేసుపై న్యాయ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తును సీబీ సీఐడీకి బదిలీ చేసింది.
Also Read : Intermediate Exams : ఏపీలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు