Chit Fund Scam: అనకాపల్లి జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో ఏకంగా 4 కోట్లు తీసుకుని జంప్ అయ్యింది ఓ మహిళ. దాదాపు 250 మంది బాధితులు ఉన్నారు. చౌడువాడలో చిట్టీలు, వరలక్ష్మి వ్రతం పేరుతో బంగారు గాజుల చిట్టీలను ప్రారంభించింది పద్మజ. లక్ష రూపాయల నుంచి 20 లక్షల వరకు చిట్టీలు వేశారు. నమ్మకం కలిగిన వారంతా చిట్టీలు పాడిన మొత్తాన్ని వడ్డీకి ఆమెకే ఇచ్చేవారు.
అలా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది పద్మజ. వారం రోజుల క్రితం కుమారుడికి బాగోలేదని ఇంటి నుంచి వెళ్లిపోయింది పద్మజ. అయితే ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పద్మజకు ఫోన్ చేశారు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సర్పంచితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకున్నారు.
చిట్టీలు వేసి మోసపోయిన బాధితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కష్టపడి సంపాదించిన డబ్బుతో చిట్టీలు కట్టామని, ఇలా మోసపోతామని అనుకోలేదని వాపోయారు. చిట్టీల డబ్బు ఇవ్వాల్సిన సమయానికి పద్మజ పరార్ అయ్యింది. పద్మజ పక్కా ప్లాన్ ప్రకారమే డబ్బుతో ఉడాయించినట్లు అనుమానిస్తున్నారు. పారిపోవడానికి ముందే తన మిత్రులు, సన్నిహితులతో రిలేషన్ కట్ చేసుకుంది.
అంతేకాదు ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసుకుంది. స్థానికులకు మాయ మాటలు చెప్పి డబ్బుతో ఉడాయించింది. తాము మోసపోయామని తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. పోలీసులే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పద్మజ ఎక్కడ ఉన్నా వెంటను తీసుకొచ్చి తమ డబ్బు తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
Also Read: విజయవాడలో రూ.300 కోట్ల భారీ మోసం.. బాధితుల్లో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కూడా..! స్కామ్ జరిగిందిలా..
కాగా, చిట్టీల పేరుతో అనేక మోసాలు జరిగాయి, జరుగుతున్నాయి. అయినా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. అధిక వడ్డీకి ఆశపడి కొందరు మోసపోతూనే ఉన్నారు. ఎక్కువ లాభాలు, అధిక వడ్డీ ఆశ చూపించి మోసాలకు తెరలేపుతున్నారు. ఇటువంటి నేరాల పట్ల పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు.