CID SI death : అనుమానాస్పద స్ధితిలో మరణించిన సీఐడీ ఎస్సై

CID Sub-Inspector Mysterious death in Bihar : పోలీసు శాఖలోని నేర పరిశోధక విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న ఒక వ్యక్తి అనుమానాస్పదస్ధితిలో మరణించి ఉండగా పోలీసులు కనుగొన్నారు. మృతుడి ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వైశాలి జిల్లాలోని అరారా గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ గోపాల్ గంజ్ లోని సీఐడీ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం 9-10 గంటల సమయంలో అతడి బంధువు నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి తన బావ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంజయ్ కుమార్ ఏప్రిల్ 3న విధినిర్వహణలో భాగంగా గోపాల్ గంజ్ జిల్లాలోని ఒక హోటల్ లో బస చేస్తున్నాడు. ఆదివారం గోరఖ్ పూర్ వెళ్లాలని బయలు దేరి వెళ్లి ..తిరిగి రాత్రి 8-30 గంటలకు హోటల్ కు తిరిగి వచ్చేశాడు.

సోమవారం కుమార్ తన హోటల్ గదినుంచి బయటకు రాలేదు. అదే సమయంలో కుమార్ భార్య ఫోన్ చేసినా సమాధానం రాక పోయేసరికి ఆమె హోటల్ సిబ్బందికి ఫోన్ చేసి చెప్పింది. హోటల్ సిబ్బంది వెంటనే సంజయ్ కుమార్ బస చేసిన గదికి వచ్చి తలుపు కొట్టగా ఎటువంటి సమాధానం రాకపోవటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హోటల్ కు వచ్చిన పోలీసులు గది తలుపులు పగలగొట్టి చూడగా ఎస్సై అనుమానాస్పదస్ధితిలో మరణించి ఉన్నారు. అతని రూం నుంచి మూడు ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాల్ గంజ్ ఆస్పత్రికి తరలించారు.

శరీరంపై ఎటువంటి గాయాలు లేవని… అధికంగా మద్యం సేవించినట్లు ప్రాధమికంగా గుర్తించామని ఎస్సై సురేంద్రకుమార్ తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక మరణానికి కారణాలు తెలుస్తాయని ఆయన అన్నారు.

ట్రెండింగ్ వార్తలు