డిసెంబర్-18నే…నిర్భయ దోషులకు ఉరిపై ఢిల్లీ కోర్టు

నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను వెంటనే ఉరితీసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను డిసెంబర్ -18,2019కి వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. బుధవారం(డిసెంబర్-18,2019)మధ్యాహ్నాం 2గంటలకు ఈ పిటిషన్ పై విచారణ చేయనున్నట్లు అడిషినల్ సెషన్ జడ్జి సతీష్ కుమార్ అరోరా తెలిపారు.

నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినందువల్ల అది డిసెంబర్ 17న విచారణ రానుందని అప్పటివరకు ఎదురుచూడాలని తాను భావిస్తున్నట్లు జడ్జి సతీష్ కుమార్ తెలిపారు. నిందితులు ఆలస్యపు ఎత్తుగడలు ప్లే చేస్తున్నారని ఇవాళ కోర్టులో ప్రొసీడింగ్స్ సమయంలో నిర్భయ తల్లిదండ్రులు ఆరోపించారు. ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని,మరో వారం రోజులు ఎదురుచూస్తామని ఢిల్లీ కోర్టు డిసెంబర్ 18కి పిటిషన్ వాయిదా వేసిన అనంతరం నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో అన్నారు.

మరోవైపు నిర్భయ దోషులకు ఏకకాలంలో ఉరిశిక్షను అమలు చేసేందుకు తీహార్ జైలు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకే ఉరి కొయ్యకు నలుగురి మెడలకు వేర్వేరు తాళ్లతో కట్టి ఒకేసారి ఏకకాలంలో ఉరిశిక్ష విధించాలని తీహార్ జైలు అధికారులు నిర్ణయించారు. ఇలా నలుగురు దోషులను ఏకకాలంలో ఉరి తీయడం మొట్టమొదటిసారి కానుండటం విశేషం.